CM Jagan: కీలక నిర్ణయాల దిశగా జగన్.. క్యాడర్ కు ఇదే ఆఖరి మాట

ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేలు, మంత్రులతో వర్క్ షాపులు నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరును బెరీజు వేయడానికి, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల అమలుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి ఇదివరకు చాలా కార్యక్రమాలను నిర్వహించారు.

Written By: Dharma, Updated On : October 9, 2023 12:15 pm

Jagan

Follow us on

CM Jagan: వైసిపి కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో25 ఎంపీ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది. క్లీన్ స్వీప్ చేయాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రూపొందిస్తున్నారు. వై నాట్ 175 అన్న స్లోగన్ను ఏనాడో పార్టీ శ్రేణులకు పంపించారు.అటు అభ్యర్థుల విషయంలో కూడా స్పష్టతనిస్తున్నారు.పనిచేయని వారిని పక్కకు తప్పిస్తానని హెచ్చరించారు. కనీసం 30 మంది సిట్టింగ్ లను మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేలు, మంత్రులతో వర్క్ షాపులు నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరును బెరీజు వేయడానికి, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల అమలుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి ఇదివరకు చాలా కార్యక్రమాలను నిర్వహించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమాన్ని ప్రామాణికంగా తీసుకోనున్నారు.గడపగడపకు వెళ్లి.. ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తేనే టికెట్లని ఇదివరకే జగన్ తేల్చేశారు. కార్యక్రమాన్ని ఐపాక్ టీం పరిశీలించింది. ఓ నివేదికను తయారు చేసింది. దాని ప్రకారమే జగన్ టిక్కెట్లు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు.

పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఆ స్థాయిలో ప్రజల నుంచి సంతృప్తి రాకపోవడం జగన్కు కలవరపాటుకి గురిచేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. అయినా జగన్ వై నాట్ 175 అన్న స్లోగన్ మాత్రం విడిచిపెట్టలేదు. సంక్షేమ పథకాలతో వ్యతిరేకతను అధిగమిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.గట్టిగా పోరాడితే ప్రతి నియోజకవర్గాన్ని సైతం గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో కష్టపడితే విజయం సునాయాసం అవుతుందని నమ్ముతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై అభ్యంతరాలు ఉన్నాయి. ఈ తరుణంలో విజయవాడలో వైసిపి రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించడానికి జగన్ నిర్ణయించడం విశేషం.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైసిపి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఈ సభ ప్రారంభమవుతుంది. జగన్ తో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్లు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ఎంపీలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పిటిసిలు హాజరు కానున్నారు. ఎన్నికల దిశగా జగన్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.