Pawan Kalyan: తాము ఒకటి తలిస్తే.. అధినేత ఒకటి తలుస్తున్నారు. దీంతో జనసైనికులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. అధినేతను అధిగమించలేక.. ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సి వస్తోంది. చంద్రబాబు అరెస్టు తరువాత.. పవన్ స్పందించిన తీరు తర్వాత జన సైనికులు ఒక రకమైన అంతర్మధనం ప్రారంభమైంది. తాము క్షేత్రస్థాయిలో వైసిపి, టిడిపిలను ఎదుర్కొంటే.. అందుకు భిన్నంగా పవన్ ప్రవర్తిస్తున్నారని.. విభిన్నంగా స్పందిస్తున్నారని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అన్ని పార్టీలకు వ్యూహకర్తలు ఉన్నారు. సోషల్ మీడియా వింగులు ఉన్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాటిని నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ అన్నింటికీ మించి జనసేనకు అభిమానులే కొండంత అండ. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జన సైనికులు స్పందించారు. జగన్ కేసుల్లో ఏ 1, చంద్రబాబు కేసుల్లో ఏ 1, కానీ అవినీతి మచ్చలేని నాయకుడు పవన్ అంటూ ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే అవినీతి లేని నాయకుడు.. అవినీతి చేసిన చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని పెడుతున్న కామెంట్స్ కు జనసైనికుల నుంచి సమాధానం కరువవుతోంది.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ స్పందించారు. ఎటువంటి ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేయడానికి తప్పుపట్టారు. అయితే అవినీతి ఆరోపణలు వచ్చిన చంద్రబాబును వెనుకేసుకు రావడం ఏమిటని ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. అది ఎక్కువగా జనసేన వర్గాల నుంచే వ్యక్తం అయ్యింది. జగన్ అవినీతిపరుడని.. ఆయన గద్దె దిగాలని పవన్ కోరుతున్నారు. మరి అటువంటి అప్పుడు చంద్రబాబు అవినీతి కనిపించడం లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ఈ విషయంలోనే అధినేత పవన్ అభిప్రాయంతో జనసేన శ్రేణులు విభేదిస్తున్నారు. అయినా సరే అధినేత మాటకు తల ఒంచుచుతున్నామని సోషల్ మీడియా లోనే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఆది నుంచి జనసైనికులు వైసిపి, టిడిపిలకు సమదూరం పాటించాలని కోరుతూ వస్తున్నారు. కానీ పవన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. టిడిపికి అనుకూలంగా ఉండటంతో వైసిపి ప్యాకేజీ అని ముద్ర వేస్తుంది. ఆ కామెంట్ విషయంలో సగటు జన సైనికుడు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు విషయంలో సైతం పవన్ అతిగా స్పందించారని అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఇటువంటి సమయంలో అవినీతి మచ్చలేని నాయకుడు పవన్ అని చెప్పుకోవడానికి కూడా తమకు అవకాశం లేకుండా పోతోందని బాధపడుతున్నారు. అటు అధినేత వరకు ఆ విషయం వెళ్లాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.