AP Revenge Politics: రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతోంది. కానీ అవశేష ఆంధ్ర ప్రదేశ్ లో ఎటువంటి పురోగతి లేదు. రాజధాని లేని రాష్ట్రంగా భారత రాజకీయ యవనికపై ఏపీ నిలిచింది. ఇప్పటికీ అంతర్గత రాజకీయ సమస్యలతో సతమతమవుతోంది. తొలి ఐదేళ్లు ప్రగతివైపు అడుగులు వేసినా.. ప్రస్తుత నాలుగున్నర ఏళ్ల మలి సమయం మాత్రం కక్షలు, కార్పన్యాలకు ఏపీ వేదికగా నిలవడం ఆందోళన కలిగించే విషయం. అభివృద్ధి మచ్చుకైనా కానరాకపోవడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం.
2014లో రాష్ట్ర విభజన జరిగింది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ క్రమంలోనే అవశేష ఏపీలో తొలిసారిగా అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్ వడివడిగా అడుగులు వేసింది. మధ్యలో అనేక రకాల ఇబ్బందులు వచ్చినా అధిగమించి ముందడుగు వేయగలిగింది. ముఖ్యంగా అమరావతి రాజధానిని అన్ని వర్గాలతో ఆమోదముద్ర వేయించి.. రైతుల నుంచి భూములను సేకరించగలిగింది.పరిశ్రమల ఏర్పాటు, పోలవరం వంటి అంశాలలో మంచి పురోగతిని సాధించింది. అభివృద్ధిపై సమీక్షలతో పాటు చర్చలు జరిగేవి. దానికి తగ్గ ప్రతిఫలం కనిపించేది. శాంతిభద్రతలు సైతం అదుపులో ఉండేవి.
కానీ 2019 ఎన్నికల తరువాత ఏపీలో సీన్ మారింది. జగన్ సీఎం గా బాధ్యతలు తీసుకున్నాక.. ఎన్నో రకాలుగా మార్పులు సంతరించుకుంటాయని ప్రజలు భావించారు. కానీ ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పాలన సాగుతోంది. అభివృద్ధి గీతలు చెరిగిపోయాయి. కక్షలు ప్రారంభమయ్యాయి. రాజకీయ అంశాలకే ప్రాధాన్యం తప్ప… ఏపీ భవిత ఏమిటన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. ప్రశ్నించే వారి గొంతు నొక్కాలి. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు నమోదు చేయాలి. వారికి జైలుకు పంపించాలి. నిత్యం ఇదే ధ్యాసతో ఏపీ సర్కార్ వ్యవహార శైలి కొనసాగుతోంది. సంవత్సరంలో 365 రోజులు పాటు 144 సెక్షన్ విధించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీలోనే చూస్తుండడం విడ్డూరం.
ఎక్కడైనా రాజకీయాలు సర్వసాధారణం. పగలు, ప్రతీకర రాజకీయానికి తమిళనాడు పెట్టింది పేరు. అటువంటి చోటే యువ నాయకుడు స్టాలిన్ సరికొత్త బీజం వేశారు. ప్రత్యర్థుల వేధింపులకు పుల్ స్టాప్ పెట్టారు. ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. అంతెందుకు పొరుగునే రాజకీయ స్నేహితుడైన కెసిఆర్ సర్కార్నే తీసుకుందాం. ఏపీ కంటే మాటల వాడి అధికంగా ఉంటుంది. రాజకీయ ఆరోపణల సైతం హీట్ పెంచేలా ఉంటాయి. కానీ రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టిస్తున్నారా? కేసులు నమోదు చేయిస్తున్నారా? అంటే అదీ లేదు. అది ఎంత కాలమో మనగలదని సీనియర్ నాయకుడు కేసీఆర్ కు తెలుసు. కానీ జగన్ మాత్రం అంతులేని అధికార దాహంతో రాజకీయ కక్షలు కొనసాగిస్తుండడం సరైన చర్య కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇక్కడితో ఆగదని.. భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని.. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.