Jagan: ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందా? ఏకపక్ష విజయం దక్కించుకోనుందా? గత ఎన్నికల కంటే సీట్లు పెరుగుతాయి తప్ప తగ్గవా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ. ఐప్యాక్ కార్యాలయానికి వచ్చిన జగన్ ఈ ధీమా ప్రకటన చేశారు. అయితే పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకే జగన్ ఈ తరహా ప్రకటన చేశారని తెలుగుదేశం కూటమి అనుమానిస్తోంది. లేదు జగన్ వద్ద పక్కా నివేదికలు ఉన్నాయని వైసీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. దీంతో దీనిపైనే గత రెండు రోజులుగా చర్చ జరుగుతోంది. ఎవరికి తోచింది వారు విశ్లేషణలు ప్రారంభించారు. ప్రధానంగా ఈసారి వైసీపీకి 22 ఎంపీ స్థానాలు వస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేయడం విశేషం.
గత ఎన్నికల్లో వైసీపీకి 22 ఎంపీ స్థానాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలకి పరిమితం అయింది. శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయవాడ నుంచి కేసినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ మాత్రమే టిడిపి నుంచి గెలుపొందిన వారిలో ఉన్నారు. అయితే ఇందులో కేసినేని నాని వైసీపీలో చేరి విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గల్లా జయదేవ్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిష్క్రమించారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి 22 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నామని జగన్ తేల్చి చెప్పడం మాత్రం ఆసక్తికరంగా మారింది. గతంలో గెలిచిన స్థానాలను మాత్రమే గెలవబోతున్నారా? లేకుంటే కొత్త వాటిని గెలుస్తున్నారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ శాతాన్ని నిర్దేశించుకుని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు స్థానాలు టిడిపికి వచ్చే అవకాశం ఉందని… మిగతా స్థానాలు వైసీపీకి దక్కుతాయని జగన్కు ఒక నివేదిక వచ్చినట్లు తెలుస్తోంది.
మహిళా ఓటింగ్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీకి ఛాన్స్ ఉంటుందన్నది ఒక నమ్మకం. వృద్ధులు, సాయంత్రం 6 గంటలకు పోలింగ్ జరిగిన కేంద్రాల్లో ఓటింగ్ వైసీపీకి అనుకూలంగా ఉంటుందన్నది మరో అంచనా. దీని ప్రకారమే 23 పార్లమెంట్ స్థానాల్లో వైసిపి గెలుస్తుందని జగన్ నమ్మకంగా చెబుతున్నారు. పూర్తిస్థాయి నివేదికలు వచ్చిన తర్వాత లెక్క కట్టి ఈ ప్రకటన చేశారన్నది వైసిపి నుంచి వస్తున్న మాట. అయితే గత ఎన్నికల్లో అంతటి ప్రభంజనంలోనే 23 స్థానాలను దక్కించుకుంది వైసిపి. ప్రస్తుతం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగ ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. మూడు పార్టీలు కూటమి కట్టాయి. యువత ఏకపక్షంగా కూటమి వైపు వెళ్లినట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వైసిపికి 22 ఎంపీ స్థానాలు సాధ్యమా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఎవరి ధీమా వారిది. జగన్ ధీమా వాస్తవమో? కాదో? జూన్ 4న తెలుస్తుంది.