AP Elections 2024: సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించి చాలా రోజులు దాటుతోంది. అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ప్రకటించాయి. ఈనెల 18 నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు అభ్యర్థులు చాప కింద నీరులా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే గతం మాదిరిగా విస్తృత ప్రచారం మాత్రం చేయలేకపోతున్నారు. గతంలో రోడ్లమీదకు ప్రజలు బాహటంగా ముందుకు వచ్చేవారు. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేవారు. ఇప్పుడు గాని ఆ పరిస్థితి కనిపించడం లేదు.ఇంకా పెద్దగా ఊపు రాలేదు.
సాధారణంగా ఎన్నికల ప్రచారం అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. అందునా ఏపీకి సంబంధించి నాలుగో విడత అంటే.. మే 13న పోలింగ్ జరగనుంది. ఈ లెక్కన చాలా రోజులు సమయం ఉంది. ఇప్పుడు గానీ ప్రచారం మొదలు పెడితే.. ఖర్చులు తడిపి మోపెడు అవ్వడం ఖాయం. ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రి మందు వినోదాల గురించి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖర్చు లేనిది జనం రారన్న విషయం అభ్యర్థులకు తెలుసు. అందుకే అభ్యర్థులు ప్రచారం చేసేందుకు ముందుకు రావడం లేదు. కేవలం ఇంటింటా ప్రచారంతో, అది కూడా కొద్దిమందితో మమ అనిపిస్తున్నారు. దాదాపు అన్ని పార్టీల అభ్యర్థుల పరిస్థితి ఇలానే ఉంది. కేవలం కార్యాలయాల్లో వ్యూహాలకే ప్రస్తుతానికి పరిమితం అవుతున్నారు.
ప్రస్తుతానికి అయితే తమ పార్టీల అధినేతల పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. రోజుకు ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. అతి చంద్రబాబు సైతం రోజుకు మూడు అసెంబ్లీ స్థానాల చొప్పున.. ప్రజాగళం పేరిట ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అతి పవన్ సైతం తాను పోటీ చేయబోయే పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో పర్యటనలు కొనసాగించనున్నారు. కానీ గ్రామాల్లో మాత్రం ఎన్నికల వాతావరణం రాలేదు. ప్రచారాలు ముమ్మరం కాలేదు. నామినేషన్ల స్వీకరణ వంటి కార్యక్రమాలతో ప్రచారం ఊపందుకునే అవకాశం ఉంది.
గతంలో ఎన్నికలంటే ఆ సందడి వేరు. తాము అభిమానించే పార్టీకి, అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేందుకు ప్రజలు ముందుకు వచ్చేవారు. నాయకులు, కార్యకర్తలు చాలా యాక్టివ్ గా పని చేసేవారు. పోలింగ్ ముగిసిన వరకు మరో పని పెట్టుకునే వారు కాదు. కుటుంబ కార్యక్రమాలను సైతం వాయిదా వేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అభిమానించే పార్టీ, నాయకుడు గెలవాలని కోరుకున్నా.. వారికి మద్దతుగా ప్రచారం చేయడానికి ముందుకు వచ్చేది కొందరే.అందుకే ప్రచార శైలి మారింది. ఈ నెల 18 తర్వాత.. నామినేషన్లు పడ్డాక.. ప్రచారం ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.