Magunta Sreenivasulu Reddy: ఏపీ రాజకీయాల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో టిక్కెట్లు, గౌరవం దక్కని వారు పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు. ” పోయినోళ్లందరూ మంచోళ్ళు.. ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపి గుర్తులు” అన్న సినీ కవి మాటలకు వ్యతిరేక పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటి వరకు మంచోళ్ళుగా కనిపించిన వారు చెడ్డోళ్ళుగా.. చెడ్డోలుగా కనిపించిన వారు మంచివారుగా మారిపోతున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల అనుకూల మీడియాలో ఈ స్వరం మారిపోతుండడం విశేషం.
నిన్నటి వరకు మాగంటి శ్రీనివాసులు రెడ్డి ఎల్లో మీడియాకు ఆర్థిక నేరస్తుడిగా కనిపించాడు. ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎంత స్థాయిలో డ్యామేజ్ చేయాలో.. ఎల్లో మీడియా అంతలా చేసింది. పతాక శీర్షికన వ్యతిరేక కథనాలను రాసుకొచ్చింది. ఇప్పుడు అదే మాగుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపిలో చేరుతుండడంతో ఆయన తప్పేమీ లేదని.. వైసిపి ప్రభుత్వ పెద్దలు ఈ విధంగా చేయించారని రాసుకోస్తుండడం విశేషం. అటు విజయవాడ ఎంపీ కేశినేని నాని విషయంలో సైతం ఎల్లో మీడియాది వక్ర భాష్యం. నిన్నటి వరకు ఆయన మంచి నాయకుడు. ఇప్పుడు టిడిపిని నాశనం చేసిన నాయకుడుగా ఎల్లో మీడియా పేర్కొనడం విశేషం.
పోనీ వైసిపి అనుకూల మీడియా అయినా సక్రమంగా వెళుతుంది అంటే అదీ లేదు. నిన్నటి వరకు ఇంద్రుడు చంద్రుడు అంటూ చాలామంది నాయకులను ఉద్దేశించి రాతలు రాసింది. అటువంటి వారంతా జగన్ ను విభేదించి విపక్షాల వైపు వెళుతుండడంతో తట్టుకోలేకపోతోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరుతానని ప్రకటించగా.. ఆయనను ఒక ఆర్థిక నేరస్తుడిగా చూపించే ప్రయత్నం చేయడం ప్రారంభించారు. ఒక్క బాలశౌరి విషయంలోనే కాదు.. వైసీపీని వీడుతున్న నాయకుల విషయంలో సాక్షితో పాటు నీలి మీడియా వ్యతిరేక కథనాలు ప్రారంభించడం విశేషం. జర్నలిజం అనేది సమాజ అభ్యున్నతికి కాదు.. రాజకీయ అవసరాలు, ఆవశ్యకతలపై ఆధారపడి ఉంటుందని చేసి చూపిస్తున్నారు. ఈ విషయంలో ఎల్లో, నీలి, తటస్థ మీడియాలేవీ అతీతం కావు. దీంతో ఈ రాతలు చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. అంతలా తయారయ్యింది మీడియా వ్యవహార శైలి.