Chandrababu Helicopter: టిడిపి అధినేత చంద్రబాబు పర్యటనలో కలకలం రేగింది. ఆయన పర్యటిస్తున్న హెలికాప్టర్ కొద్దిసేపు దారి తప్పింది. దీంతో అంతా అయోమయానికి గురయ్యారు. కొద్దిసేపటికి గమ్య స్థానానికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రా కదలిరా పేరిట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఓ అసెంబ్లీ కేంద్రంలో సభలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అరకులో ఈరోజు సభ ఏర్పాటు చేశారు. ఇందుకుగాను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి అరకుకు హెలికాప్టర్ లో బయలుదేరారు. అయితే నిర్దేశించిన రూట్లో కాకుండా వేరే మార్గంలో హెలికాప్టర్ వెళ్లడంతో కలకలం రేగింది.
రూట్ విషయంలో పైలెట్ అయోమయానికి గురికావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఏటీసీ సూచనలను పైలట్ సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం. హెలిక్యాప్టర్ రాంగ్ రూట్లో వెళ్తున్నట్లుగా గుర్తించిన ఏటీసీ వెంటనే పైలెట్ ను అప్రమత్తం చేసింది. దీంతో పైలెట్ హెలికాప్టర్ ను తిరిగి విశాఖకు తీసుకొచ్చారు. మళ్లీ నిర్దేశించిన మార్గంలో అరకు బయలుదేరిన హెలికాప్టర్ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది. కొద్దిసేపు మాత్రం ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పక్కదారి పట్టిందన్న వార్తలు నేపథ్యంలో టిడిపి శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.
హెలిక్యాప్టర్లో రాకపోకలకు విమానాశ్రయ ఏటీసీ క్లియరెన్స్ తప్పనిసరి. వారు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారమే వెళ్లాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు ప్రయాణించే హెలికాప్టర్ పైలెట్ కు, ఏటీసీకి మధ్య సమన్వయం లేకుండా పోయింది. దీంతో పైలెట్ గందరగోళానికి గురయ్యారు. నిర్దేశిత మార్గంలో కాకుండా వేరే దారిలో హెలికాప్టర్ ను నడిపారు. ఈ విషయాన్ని గుర్తించిన ఏటీసీ పైలెట్ కు హెచ్చరికలు పంపింది. ఏపీసి సూచనలతో వెనక్కి మళ్లించిన పైలెట్.. తిరిగి సరైన మార్గంలో చాపర్ ను తీసుకెళ్లారు. విశాఖ మన్యంలో మావోయిస్టుల ప్రాబల్యం, చంద్రబాబు జెడ్ ప్లస్ భద్రత ఉన్న నేత కావడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే కాసేపటికి మళ్ళీ సరైన దారిలోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.