https://oktelugu.com/

BRS-YCP : బీఆర్ఎస్, వైసీపీ వ్యూహాలు ఫలిస్తున్నాయా? బూమరాంగ్ అవుతున్నాయా..

కొందరి మీద సానుభూతి వర్కవుట్ అవ్వడం చూస్తుంటాం. మొత్తానికి రాజకీయాల్లో కొనసాగాలంటే ఎత్తుగడలు వేయడంతోపాటు.. ప్రత్యర్థి ఆలోచనలకు ఒక మెట్టు పైకి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఏపీలోని వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిల వైఖరిపై తీవ్ర చర్చ నడుస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 27, 2024 / 01:23 PM IST

    BRS-YCP

    Follow us on

    BRS-YCP :  రాజకీయాల్లో ఒక్కోసారి ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతుండడాన్ని చూస్తుంటాం. రాజకీయాలు అంటేనే ఎన్నో ఒడిదుడుకులు.. మరెన్నో సవాళ్లు. ఎప్పుడు ఎవరిని ఓటమిని వరిస్తుందో.. ఎవరికి గెలుపు వస్తుందో ఊహించడం తెలియదు. ప్రజల అంచనాలను ఊహించడం కూడా చాలా కష్టం. ఒక్కోసారి రాజకీయాల్లో కురువృద్ధులైనా.. యంగ్ స్టర్స్ చేతుల్లో ఓటమి పాలవుతుంటారు. ఇంకొన్ని చోట్ల పలుకుబడి పనిచేస్తుంటుంది. లేదంటే చేసిన సేవా కార్యక్రమాలు గెలిపిస్తాయి. కొందరి మీద సానుభూతి వర్కవుట్ అవ్వడం చూస్తుంటాం. మొత్తానికి రాజకీయాల్లో కొనసాగాలంటే ఎత్తుగడలు వేయడంతోపాటు.. ప్రత్యర్థి ఆలోచనలకు ఒక మెట్టు పైకి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఏపీలోని వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిల వైఖరిపై తీవ్ర చర్చ నడుస్తోంది.

    తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. మొదట్లో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఆ తరువాత పూర్తిగా రాజకీయ పార్టీగానూ మారిపోయింది. అయితే.. ఉద్యమకాలంలో కేసీఆర్ పై ఉన్న నమ్మకం, ఉద్యమంపై ఉన్న మమకారంతో చాలా మంది నేతలు ఆయన వెంట నడిచారు. పార్టీని అక్కున చేర్చుకున్నారు. అటు కేసీఆర్ ఉద్వేగభరిత ప్రసంగాలతోపాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్నారు. అలా ఉద్యమ సమయంలోనే ఆ పార్టీకి చెప్పుకోదగిన విధంగా స్థానాలను కట్టబెట్టారు. తరువాత తరువాత రాష్ట్రం సిద్ధించాక కూడా ఉద్యమ పార్టీని ప్రజలు ఎక్కడా వీడలేదు. ఉద్యమంలో ఎలా అయితే తోడుగా నిలిచారో.. ఆ తరువాత కూడా అంతేస్థాయిలో అక్కున చేర్చుకున్నారు.

    అలా మొదటి సారి రాష్ట్రంలో ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. కేసీఆర్ ఆ విధంగా మొదటి సారి సీఎం అయ్యారు. రాజకీయ చాణక్యుడిగా పేరున్న కేసీఆర్.. అటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చూస్తూనే.. ఇటు ఉద్యమ పార్టీని కాస్త పక్కా రాజకీయ పార్టీగా మార్చేశారు. అయినప్పటికీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి పార్టీ వెంటే ఉండిపోయారు. ఆ తరువాత మొదటి టర్మ్ ముగిసింది. రెండో టర్మ్‌లోనూ మరోసారి గులాబీ పార్టీ హవానే సాగింది. అలా రెండు పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన డక్కిమొక్కీలు తిన్నారు. పదేళ్ల అధికార పీఠానికి బీటలు పడ్డాయి. ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

    ఇక జగన్‌మోహన్ రెడ్డి విషయానికి వస్తే తన తండ్రి వైఎస్సార్ రాజకీయవారసత్వాన్ని అందిపుచ్చుకొని జగన్ రాజకీయాల్లో వచ్చారు. ఎంపీగా భారీ మెజార్టీతో విజయాలు సాధించారు. అనుకోకుండా తండ్రి వైఎస్సార్ మరణం పొందడంతో ఆయనకు పెద్ద పరీక్షలే ఎదురయ్యాయి. అయితే.. ముఖ్యమంత్రి ఆశించి ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వలేదు. దాంతో పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కాంగ్రెస్‌తో కొట్లాడిన ఆయన చివరకు సంవత్సరంన్నర పాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఇక జైలు నుంచి బయటకు వచ్చాక నిత్యం ప్రజల్లో ఉండిపోయారు. అప్పటికే రాష్ట్ర విభజన జరగడంతో మొదటి సారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు జగన్. కానీ.. ఎప్పటిలాగే ప్రజలు సీనియారిటీకి పట్టం కట్టారు. చంద్రబాబును సీఎం చేశారు. అలా.. ఐదేళ్లు గడిచాక చంద్రబాబు పాలనపై విసుగు చెందిన ప్రజలు ఆ తదుపరి ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేశారు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్.. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. వై నాట్ 175 అని అత్యాశతో ప్రచారంలోకి వెళ్లిన ఆయన చివరకు అధికారం కోల్పోవాల్సి వచ్చింది.

    అయితే.. ఇక్కడ కేసీఆర్, జగన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా కేసీఆర్ స్వయంగా ఏపీ రాష్ట్రానికి వెళ్లారు. అటు జగన్ కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఒకవిధంగా చెప్పాలంటే ఓ కుటుంబ సభ్యుల్లాగే వారు కలిసిమెలిసి ఉండేవారు. అయితే.. ఇద్దరు కూడా ఒకేసారి అధికారాన్ని కోల్పోవడం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు ఇద్దరు కూడా అధికారం కోల్పోయి ఉన్నారు.

    ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర అంశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీకి వచ్చే సరికి లడ్డూ వివాదం రచ్చగా మారింది. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారంటూ టీడీపీ ప్రభుత్వం పెద్దలు వైఎస్సార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వ్యవహారంలో జగన్ చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారనే చెప్పాలి. నెయ్యిలో కల్తీ జరిగితే దాంతో తనకేం సంబంధం అని చెప్పాల్సిన జగన్.. లేదు లేదు నేను నేనే అంటూ నెత్తినేసుకుంటున్నారు. దాంతో ఇప్పుడు ఆయన ఆ వివాదం నుంచి బయటపడడం పెద్ద టాస్క్ అయింది. కల్తీ జరగలేదని మీడియా ముఖంగా చెబుతున్నప్పటికీ ఆయనకు ఆ స్థాయిలో మైలేజీ రావడం లేదనేది వాస్తవం. చంద్రబాబు రాజకీయ చతురత ముందు ఈయన పప్పులు ఉడకడం లేదు అనేది అక్కడ నడుస్తున్న టాక్. అయితే.. దాని నుంచి కొంతైనా కాపాడుకునేందుకు ఇప్పుడు తిరుమల దర్శనానికి వెళ్తున్నారు. ఆయన తిరుమలకు వెళ్లినంత మాత్రానా పడిన ముద్ర పోతుందా..? ల్యాబ్ రికార్డులు తారుమారు అవుతాయా..? అందుకే.. జగన్ రాజకీయ పాఠాలు ఇంకా నేర్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ఆయన తిరుమలకు వస్తే అక్కడ ఖచ్చితంగా నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో.. అది కాస్త ఆయనకు పెద్ద మైనసే అవుతుంది. గతంలో ఆయన రాజకీయాల కోసం ఎన్నడూ తిరుపతికి వెళ్లింది లేదు. కానీ.. ఈసారి తన నిజాయితీని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో తిరుమలకు వెళ్తున్నా ఆ స్థాయిలో నిరసనలు తప్పితే మైలేజీ వస్తుందన్న గ్యారంటీ అయితే లేదు.

    తెలంగాణలో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి కేసీఆర్ సైలెంట్ అయ్యారు. దాంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతా తానై నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు భగ్గుమంటున్నారు. అయితే.. కేటీఆర్ రాజకీయాలు కూడా జగన్ వలే ఆలోచన లేకుండా ఉంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ప్రతిపక్ష హోదాను ఎదుర్కోలేదు. మొదటిసారి అధికారం కోల్పోవడంతో ఆవేశంతో ఏదేదో మాట్లాడేస్తున్నారు. ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేస్తున్న ప్రతీ కార్యక్రమాన్ని వ్యతిరేకించడమే అనే ధోరణిలో ఉన్నారు. ప్రజలు తన వ్యాఖ్యల్ని నమ్ముతారా లేదా అని కనీసం ఆలోచన చేయకుండా.. ఎంతసేపూ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ నిత్యం రేవంత్ పై, కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థపైనా కేటీఆర్ చేస్తున్న ఆరోపణలకు విలువ లేకుండాపోయింది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన వాటినే హైడ్రా కూల్చివేస్తోంది. ప్రైవేటు స్థలాల్లో నిర్మించుకున్న చిన్న గుడిసెను కూడా వారు టచ్ చేయలేదు. కానీ.. దానిపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు ప్రజాక్షేత్రంలో మాత్రం తీవ్ర విమర్శలకు దారితీశాయనే చెప్పాలి. చివరకు ఆయన మూసీ అక్రమాలను సైతం వ్యతిరేకిస్తుండడం ఇక్కడ కొసమెరుపు.

    మొత్తానికి.. తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, వైసీపీలు ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నాయి. దాంతో ఏ ఇష్యూను ఎలా ఎంచుకోవాలి..? ఏ ఇష్యూను ఎలా పాజిటివ్‌గా మలచుకోవాలి..? అనే మినిమం ఆలోచనలు లేకుండా దూకుడుగా వ్యవహారంతోనే వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎదుటివారి రాజకీయాలను అంచనా వేయడంలో తడబడుతూ ఏదేదో చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటు చంద్రబాబు, ఇటు రేవంత్ రాజకీయాలను అంచనా వేయడంలో విఫలమైతే భవిష్యత్తులో బీఆర్ఎస్, వైసీపీలు మరింత పాతాళానికి పోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజకీయాలు నేర్చుకుంటే వచ్చేవి కాదని.. స్వతహాగా చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. అందుకే.. ఆవేశాలకు పోకుండా ఆలోచనలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, అలా అయితేనే భవిష్యత్తులో అధికారాలు మరోసారి చేతికి లభిస్తాయని అంటున్నారు. లేదంటే ఈ ఇద్దరు యువ నేతల రాజకీయం ఎంతో కాలం నిలువదని కూడా చెబుతున్నారు.