Ponguleti Srinivasa Reddy : పొంగులేటిని వేటాడుతోన్న బీజేపీ.. మరోసారి ఈడీ దాడులతో బెంబేలు.. అసలు టార్గెట్ ఏంటంటే?

గత నవంబర్ లో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు చేశారు. దాదాపు మూడు రోజులపాటు ఈ వ్యవహారం సాగింది.. ఆ తర్వాత పొంగులేటి ఇంట్లో నుంచి ఏం స్వాధీనం చేసుకున్నారు? ఎలాంటి ఆధారాలు వారికి లభించాయి? అనే విషయాలను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు బయటికి చెప్పలేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 27, 2024 1:36 pm

Ponguleti Srinivasa Reddy

Follow us on

Ponguleti Srinivasa Reddy : సరిగ్గా 11 నెలల తర్వాత మళ్లీ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై సోదాలు మొదలుపెట్టారు. దాదాపు 16 బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో పొంగులేటి ఇల్లు, కార్యాలయాలలో దాడులు చేశారు. కేంద్ర బలగాల సహకారంతో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. అటువైపు మీడియా, ఇతర వ్యక్తులు ప్రవేశించకుండా నిషేధం విధించారు. చివరికి రాష్ట్ర పోలీసులను కూడా అటు వైపుగా రానివ్వడం లేదు.. దీంతో ఏం జరుగుతోంది? అనే ఉత్కంఠ అందరిలోనూ కలుగుతోంది. వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత ఏడాది జనవరిలో భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేశాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాలకు తన అభ్యర్థులను ప్రకటించారు. అయితే అప్పట్లోనే బిజెపి పెద్దలు పొంగులేటి వైపు దృష్టి సారించారు. మాధవనేని రఘునందన్ రావు, ఈటల రాజేందర్ వంటి వారిని ఆయన వద్దకు పంపించారు.. పార్టీలో చేరాలని ఆహ్వానం పలికారు. దీంతో పొంగులేటి బిజెపిలో చేరుతారని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కాని పొంగులేటి అనూహ్యంగా బిజెపిలో చేరారు. బిజెపిలో చేరిన తర్వాత ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు చేశారు. అప్పట్లో ఈ దాడులను పొంగులేటి ఖండించారు. తాను భారత రాష్ట్ర సమితి నుంచి వెళ్లిపోయిన తర్వాత.. ముఖ్యమంత్రి (ప్రస్తుతం మాజీ) కేసీఆర్ బిజెపితో చేతులు కలిపి తనను వేధిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ దాడుల తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పొంగులేటి పాలేరు నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం.. ఆ ఎన్నికల్లో ఆయనే గెలుపొందడం.. ఆ తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వంటి పరిణామాలు చకచగా జరిగిపోయాయి.

మళ్లీ ఇప్పుడు

గత ఏడాది నవంబర్లో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు చేయగా.. ఇప్పుడు సెప్టెంబర్ లో తనిఖీలు మొదలుపెట్టారు. అయితే ఎందుకోసం దాడులు చేశారు? పొంగులేటి కంపెనీలోకి ఏమైనా వివాదాస్పదమైన పెట్టుబడులు ప్రవహించాయా? వస్తున్న ఆదాయానికి చేస్తున్న ఖర్చుకు పొంగులేటి కుటుంబ సభ్యులు లెక్క సరిగా చూపించడం లేదా? ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి సింగపూర్ ప్రాంతం నుంచి నిషేధిత వస్తువులను దిగుమతి చేసుకున్నాడు. అందులో ఏమైనా కీలక ఆధారాలు లభించాయా? అనే కోణంలో మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడులపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే బిజెపి ఇలాంటి ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రలో మాదిరిగానే అధికార ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ దాడులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంతవరకు నోరు విప్పక పోయినప్పటికీ.. ఆయన అనుచరులు మాత్రం రాజకీయంగా పొంగులేటిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇదని ఆరోపిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో పొంగులేటికి తిరుగు లేదని.. దాన్ని చూసి ఓర్వలేకనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు.