Telugu States BJP: తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కీలక టాస్క్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi). బిజెపి ఎంపీలకు కీలక సూచనలు చేశారు. తెలంగాణలో ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా పోరాటం చేయడంలో కెసిఆర్ పార్టీ కంటే వెనుకబడ్డారని కూడా ప్రధాని సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం చక్కగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రచారాన్ని ఎందుకు తిప్పి కొట్ట లేకపోతున్నారని కూడా ప్రధాని ప్రశ్నించినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పడం తప్పు కాదు. అలాగే ఏపీలో తమ కూటమికి ప్రత్యర్థిగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తిప్పి కొట్టాలనడం కూడా తప్పు కాదు. కానీ ఎటొచ్చి ఆ పార్టీల విషయంలో బిజెపి స్టాండ్ ఏమిటన్నది మాత్రం చెప్పకపోవడం నిజంగా లోటు. తెలంగాణలో కెసిఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఆ ఇద్దరూ తమకు బిజెపితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంకేతాలు పంపుతున్నారు. ఆ రాష్ట్రాల రాజకీయాల్లో గందరగోళం సృష్టిస్తున్నారు.
* పరస్పరం గౌరవం..
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. ఎన్డీఏ లో తెలుగుదేశం( Telugu Desam) కీలక భాగస్వామిగా ఉంది. టిడిపి తో పాటు బిజెపి పరస్పర రాజకీయ ప్రయోజనాలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఏపీలో టిడిపి కూటమికి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఆ పార్టీ విషయంలో బిజెపి ద్వంద వైఖరి అనుసరిస్తోందన్న కామెంట్ అయితే పొలిటికల్ వర్గాల్లో ఉంది. ఏపీలో టిడిపిని ప్రత్యర్థిగా భావిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపిని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. అదే సమయంలో బిజెపి నేరుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేదు. అటువంటప్పుడు అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బిజెపి ఎంపీలు ఎలా కట్టడి చేస్తారు అన్నది ప్రశ్న. లోపల కౌగిలించుకొని.. బయట ద్వేషించడం ఎలా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
* కాంగ్రెస్ ఎదగకుండా..
తెలంగాణలో బిఆర్ఎస్( Bharat Rashtra Samiti) బతికి ఉండాలన్నది బిజెపి ప్లాన్ గా విశ్లేషకులు చెప్పే మాట. ప్రస్తుతం అక్కడ అధికార పార్టీగా కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీ బలంగానే కనిపిస్తోంది. ప్రతిపక్షంగా కెసిఆర్ పార్టీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితం అయిన కెసిఆర్ పార్టీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కించుకోలేదు. అంతలా బలహీన పడింది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు 5 నుంచి6 ఎంపీ సీట్లు ఆ పార్టీకి రావాలి. బిజెపికి ఒక్క సీటు మాత్రమే రావాలి. కానీ కెసిఆర్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. బిజెపికి మాత్రం 8 సీట్లు వచ్చాయి. ఇది ఎలా సాధ్యం? లోపల మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న అనుమానం ఉంది. ఆపై బిజెపి బలమైన రాష్ట్ర నాయకత్వాన్ని మార్చింది. బండి సంజయ్ మార్పు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ గా ఎక్కువమంది భావిస్తారు. బిఆర్ఎస్ పార్టీ బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్న ఆలోచనతోనే కెసిఆర్ తో బిజెపి రాజీ కుదుర్చుకున్నట్లు ఒక ప్రచారం ఉంది. భవిష్యత్తులో కెసిఆర్ పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకుంటుందన్న టాక్ కూడా ఉంది. ఇన్ని అనుమానాలను పెట్టుకొని.. తెలుగు రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలన్న ప్రధాని సూచన ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు వాదన. దానికి బిజెపి హై కమాండ్ సమాధానం చెప్పాలి.