AP Pensions: ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. చాలా నిర్ణయాలను త్వరితగతిన తీసుకుంటోంది. కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియపై ఫోకస్ పెట్టింది. అయితే ముందుగా అనర్హుల పింఛన్లను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పైలెట్ ప్రాజెక్టు కింద అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేసింది. చాలాచోట్ల అనర్హులను గుర్తించారు. అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకుంటున్నట్లు తేలింది. అయితే అనర్హుల పింఛన్లను రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ముందుగా వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోనుంది. పింఛన్ తీసుకునే లబ్ధిదారులు ఇచ్చే వివరణలో వాస్తవం ఉంటే.. వారికి పింఛన్ కొనసాగిస్తారు. ఒకవేళ వివరణలో స్పష్టత లేకపోతే వారి పింఛన్ రద్దు చేస్తారు. ఆ మేరకు సెర్ఫ్ సీఈవో వీర పాండ్యన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ/ వార్డు సచివాలయాల కార్యదర్శులకు ప్రభుత్వం నుంచి సూచనలు కూడా అందాయి.
* ప్రతి పదివేలలో.. 500 అనర్హత పింఛన్లు
ఇటీవల ప్రభుత్వం కొన్ని సచివాలయాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. పింఛన్లను తనిఖీ చేసింది. అయితే ప్రతి 10,000 మందిలో 500 మంది అనర్హులుగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత లేకపోయినా చాలామంది పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేసే పనిలో పడ్డారు అధికారులు. కొంతమంది డాక్టర్ ఇచ్చిన ఫేక్ సర్టిఫికెట్లతో అర్హత లేకపోయినా పింఛన్లు పొందుతున్నట్లు తేలింది. వీరి పింఛన్లను కూడా ప్రభుత్వం తనిఖీ చేయనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా టీమ్లను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమీక్షలో సీఎం చంద్రబాబు దీనిపైనే స్పష్టతనిచ్చారు. పింఛన్ల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చారు. అనర్హులు పింఛన్లు పొందితే రికవరీ కూడా చేయాలని ఆదేశించారు.
* ముందుగా నోటీసులు
ప్రభుత్వ తాజా ఆదేశాలతో పింఛన్లు తీసుకునే వారికి నోటీసులు ఇస్తారు. పింఛన్ ఇవ్వడానికి అర్హత ఏముందో చెబుతూ లబ్ధిదారుల వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అర్హత నిరూపించుకో లేకపోతే.. ఆ తరువాత నెల నుంచి పింఛన్ రద్దు చేస్తారు. ఇచ్చిన గడువులోగా వివరణ ఇవ్వకపోతే ఆ పింఛన్ నిలిపివేస్తారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నట్లు తేలడం విశేషం. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పింఛన్ తీసుకుంటున్న వారు ఆందోళనతో ఉన్నారు.