YSR Congress Party
YSR Congress Party : అసెంబ్లీ సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ బహిష్కరించింది. సమావేశాలకు హాజరవుతూనే కొద్దిసేపు కూడా సభలో ఉండలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న సాకుతో బయటకు వచ్చేసారు వైసీపీ ఎమ్మెల్యేలు. అయితే ఈ పరిణామంతో ఎవరికి నష్టం? ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి వ్యూహం పని చేసిందా? కూటమి ప్రభుత్వం మాట నెగ్గిందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు వైసీపీ సభ్యులు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలా ప్రమాణం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు. తమకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే సభకు హాజరవుతామని తేల్చి చెప్పారు. అయితే ఇవి బడ్జెట్ వార్షిక సమావేశాలు కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభకు హాజరయ్యేందుకు అంగీకరించింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని అంతా భావించారు. కానీ ఇలా వెళ్లి అలా బయటకు వచ్చేయడంతో ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు షాక్ కు గురయ్యారు.
* ప్రభుత్వాన్ని ఇరికిస్తారనుకుంటే
గత కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) చాలా దూకుడుగా ఉన్నారు. ఇటీవల యాక్టివిటీస్ పెంచడంతో పార్టీలో ఒక రకమైన మార్పు ప్రారంభం అయింది. ఓటమి బాధతో ఇంటికే పరిమితమైన చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వల్లభనేని వంశీ అరెస్టు జరిగింది. ఆయనను పరామర్శించే క్రమంలో భారీగా జనాలు తరలివచ్చారు. అటు తరువాత గుంటూరు మిర్చి మార్కెట్ యార్డును సందర్శించారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ కూడా రైతుల నుంచి భారీగా స్పందన వచ్చింది. అటు తరువాత శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి కొద్ది రోజుల్లో జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని నిర్ణయం తీసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన జోష్ కనిపించింది. అది మొదలు ప్రభుత్వ వైఫల్యాలపై గర్జించేందుకు జగన్ వస్తున్నారంటూ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకున్నాయి.
* అనర్హత వేటు భయంతోనే?
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీ శ్రేణులకు షాక్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి సభలో అడుగుపెట్టి బయటకు వచ్చేసారు. అయితే జగన్ వ్యూహం వేరేలా ఉన్నట్లు తెలుస్తోంది. 60 రోజులు పాటు వరుసగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే అనర్హత వేటు పడుతుందని ఆ మధ్యన ఒక వార్త సర్క్యులేట్ అయింది. దానికి చెక్ చెప్పేందుకే జగన్ సభకు వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం ప్రజల్లో ఒక రకమైన విమర్శ ఉంది. అందుకే సభకు హాజరై.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే బహిష్కరిస్తున్నామని చెప్పి బయటకు వచ్చేసారు. తద్వారా తాను సిద్ధమేనని.. విపక్షంగా ప్రజల కోసం మాట్లాడే అవకాశం ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లే తాను బహిష్కరించినట్లు ప్రజల్లోకి సంకేతాలు పంపగలిగారు జగన్.
* కూటమి ప్రభుత్వం స్కెచ్
అయితే జగన్మోహన్ రెడ్డి సభకు వస్తే.. ఓ రేంజ్ లో విరుచుకుపడాలని కూటమి ప్రభుత్వం( Alliance government ) ఒక వ్యూహం రూపొందించింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టే వచ్చి తిరిగి వెళ్ళిపోవడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతోంది. ఒక పద్ధతి ప్రకారం జగన్ వైఫల్యాలను ఎండగడుతూ సభలో విరుచుకుపడాలని భావించింది కూటమి. ఈ విషయాన్ని ముందే గ్రహించిన జగన్మోహన్ రెడ్డి.. ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ శ్రేణులతో పాటు కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు సైతం షాక్ ఇచ్చారు.