YCP: రాష్ట్రవ్యాప్తంగా( State wise) మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఉప ఎన్నికలు జరిగాయి. వివిధ కారణాలతో ఖాళీ అయిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ పోస్టులకు గత రెండు రోజులుగా ఎన్నికలు జరిగాయి. అయితే మొత్తం పది చోట్ల ఎన్నికలు జరగగా.. అన్నిచోట్ల టిడిపి కూటమి హవా నడిచింది. ఎన్నికలకు ముందు చాలామంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూటమి వైపు మొగ్గు చూపారు. మరోవైపు ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి గెలిచేసరికి మరికొందరు చేరిపోయారు. దీంతో ఎక్కడికక్కడే డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వానికి మార్గం చూపారు. ఇంకోవైపు తిరుపతి వంటి చోట్ల కూటమి విధ్వంసాలకు గురిచేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేటర్ లను ప్రలోభ పెట్టి గెలుచుకున్నారని వైసిపి ఆరోపిస్తోంది. ఈ క్రమంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీలతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఆశలు వదులుకుంటోంది.
* పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ ఉభయగోదావరి( Godavari district), కృష్ణ- గుంటూరు కు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సైతం జరగనుంది. అయితే ఎన్నికలు సైతం సవ్యంగా జరగవని వైసిపి అభిప్రాయపడుతోంది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది వైసిపి. మరోవైపు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను సైతం సిద్ధం చేసింది. గత రెండు రోజులుగా మున్సిపాలిటీలకు సంబంధించి ఉప ఎన్నిక వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో విధ్వంసం సృష్టించి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కూటమి 10 నెలల మున్సిపల్ పాలకవర్గాలను కైవసం చేస్తుందని వైసిపి ఆరోపిస్తోంది. మున్ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉంటాయో టిడిపి కూటమి చేసి చూపించిందని చెబుతోంది.
* కూటమి తీరుపై పోరాటం
అయితే మునిసిపల్ ఉప ఎన్నికలకు( Municipa elections) సంబంధించి కూటమి వ్యవహరించిన తీరుపై పోరాటం చేయాలని వైసిపి భావిస్తోంది. వైసిపి హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను వైసిపి ఏకపక్షంగా కైవసం చేసుకుంది. కేవలం తాడిపత్రి మున్సిపాలిటీకి మాత్రమే తెలుగుదేశం పార్టీ పరిమితం అయింది. చివరకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీ సైతం వైసిపి ఖాతాలో పడింది. అయితే అప్పట్లో విధ్వంసం సృష్టించి ఎన్నికల్లో గెలిచారని అప్పటి ప్రతిపక్షం టిడిపి ఆరోపించింది. అటు తర్వాత వచ్చిన జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించింది తెలుగుదేశం. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అప్పట్లో ఆరోపించింది టిడిపి.
* అప్పట్లో టిడిపి మాదిరిగానే
అయితే అప్పట్లో టిడిపి( Telugu Desam Party) చేసుకున్న ప్రచార అస్త్రాలను ఇప్పుడు వినియోగించుకుంటుంది వైసిపి. ఏపీలో మున్ముందు ఎలాంటి ఎన్నికలు జరిగినా.. అవి విధ్వంసంతో గెలుచుకున్నవి అవుతాయని వైసిపి ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షం లేకుండా చేయాలన్నదే టిడిపి కూటమి ప్లాన్ అని ప్రచారం చేయడం ప్రారంభించింది. రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తాము అందుకే దూరం కావాల్సి వచ్చిందని కూడా ప్రజల మధ్యకు తీసుకెళ్తోంది. అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా సవ్యంగా జెరిపి అవకాశం లేదని అనుమానిస్తోంది. మొత్తానికైతే వైసీపీకి ఒక కొత్త ప్రచార అస్త్రం దొరికింది.