Ex Minister Anil Kumar Yadav : వైసీపీలో నోరున్న నేతల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. ఆ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడే దూకుడుగా వ్యవహరించారు. పవర్ లోకి వచ్చాక ఊరుకుంటారా? ఎంత అతి చేయాలో అంతలా చేశారు. పొలిటికల్ లైఫ్ ఇచ్చిన వారిని సైతం గడ్డిపూచలా తీసేశారు. వారెంత అన్నట్టు వ్యవహరించారు. జగనన్న అండగా ఉండగా ఎవడ్రా నన్నేం చేసేది అని సౌండ్ చేశారు. ఇప్పుడు అదే జగనన్న సైడ్ చేసేసరికి తట్టుకోలేకపోతున్నారు. సైలెంట్ గా ఉంటే చంపేస్తారు అంటూ కలవరపడుతున్నారు. పార్టీతో అమీతుమీకి సిద్ధపడుతున్నారు. హైకమాండ్ తో గట్టిగా పోరాటం చేయడానికి డిసైడయ్యారు. పార్టీలోని తన ప్రత్యర్థులకు గట్టి అల్టిమేటం ఇచ్చారు.
గత ఎన్నికల్లో అప్పటి తాజా మాజీ మంత్రి నారాయణపై అనిల్ కుమార్ యాదవ్ అత్తెసరు మెజార్టీతో గెలుపొందారు. అంతకు ముందు అనిల్ దూకుడు పెర్ఫార్మెన్స్ చూసిన జగన్ ముచ్చటపడి తన సామాజికవర్గాన్ని కాదని మంత్రిగా అవకాశమిచ్చారు. ఏకంగా నీటి పారుదల శాఖ మంత్రినే చేశారు. కానీ నీటి పారుదల శాఖ కాస్తా నోటి పారుదల శాఖగా మారిందని విపక్షాలు అనిల్ పై ఆరోపణలు చేశాయి. మరి అనిల్ ఊరుకుంటాడా.. ఏకంగా అసెంబ్లీలోనే విపక్షాలపై మండిపడ్డారు. మూడేళ్లు లేకి మాటలతో గడిపేశారు. అయితే సొంత పార్టీ వారికి కూడా శత్రువయ్యారు. ప్రత్యర్థి పార్టీలకు టార్గెట్ అయ్యారు. విస్తరణలో మంత్రి పదవి ఊడిపోయేసరికి తత్వం బోధపడింది. ఇంటా బయట ప్రతికూలతలు ఎదురయ్యాయి.
మంత్రి పదవే కాదు.. నెల్లూరు ఎమ్మెల్యే సీటు కూడా కష్టమని తేలిపోయింది. ఇటీవల పార్టీ వర్కుషాపులో 18 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కష్టమేనని తేలిపోయింది. ఆ జాబితాలో అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఇంటా బయటా ముమ్మరమవుతుండడంతో అనిల్ అలెర్టయ్యారు. 20 రోజులు నైరాశ్యంలో ఉన్న ఆయన నేరుగా నెల్లూరులో వాలిపోయారు. తన వారితో సమావేశం ఏర్పాటుచేశారు. ఇలాగే ఉంటే తనను చంపేస్తారని.. తత్వం బోధపడిందని.. పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అయితే అనిల్ విషయంలో హైకమాండ్ బాణి తెలిసిన తరువాత అనుచరులు సైతం జారిపోయారు. కొద్దిమంది మాత్రమే ఆయన వెంట మిగిలారు.
గత ఎన్నికల్లో అత్తెసరు మెజార్టీతో అనిల్ గెలుపొందారు. నాయకులంతా సమన్వయంగా వ్యవహరించడంతో బయటపడ్డారు. ముఖ్యంగా నెల్లూరు డిప్యూటీ మేయర్, బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ సహకరించడంతో గెలుపు సాధ్యమైంది. అటువంటి బాబాయ్ తోనే అనిల్ గొడవ పెట్టుకున్నారు. దీంతో నెల్లూరు సిటీలో సొంత అజెండాతో రూప్ కుమార్ వెళుతున్నారు. దీనికి హైకమాండ్ సహకారం ఉందన్న టాక్ నడుస్తోంది. అన్నింటికీ మించి మాజీ మంత్రి నారాయణ నెల్లూరులో ఎంటరవుతున్నట్టు అలికిడి వస్తోంది. దీంతో అనిల్ ను సైడ్ చేసి రూప్ కుమార్ ను జగన్ తెరపైకి తెస్తున్నారు. దీనిని చావుతో పోల్చిన అనిల్ మెత్తగా ఉంటే చంపేస్తారంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు. దీంతో నెల్లూరు రాజకీయం రసకందాయంలో పడింది.