Chandrababu : తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సమకాలీకులు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు మించి సీనియర్లు కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు వంటి నేతలు చాలామంది ఉన్నారు. 1983 నుంచి వారు కొనసాగుతున్నారు. కానీ చంద్రబాబు 1985లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు తాజా ఎన్నికల్లో చాలామంది సీనియర్లు పక్కకు తప్పుకున్నారు. వారసులకు ఛాన్స్ ఇచ్చారు. అటువంటివారు గౌరవప్రదమైన పదవీ విరమణ కోరుకుంటున్నారు. ముఖ్యంగా రాజ్యసభ పదవులను ఆశిస్తున్నారు. కానీ ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులు ఉండడంతో.. పదవులు సర్దుబాటు చేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అదే జరిగితే సీనియర్లకు ఛాన్స్ అనుమానం కలుగుతోంది.
* ఆ రెండు పార్టీలకు అవకాశం ఇవ్వాల్సిందే
తాజాగా ఏపీ నుంచి మూడు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే మూడు పార్టీలు పదవులు కోరుకుంటున్నాయి. జనసేనకు ఒక సీటు వదులుకోవాల్సిందే. ఇప్పటికీ ఆ పార్టీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు అయ్యింది. బిజెపి ఒక స్థానం కోరుకుంటుంది. జాతీయ అవసరాల దృష్ట్యా తమకు రాజ్యసభ సీటు కావాలని కోరుతోంది. కేంద్ర పెద్దలే స్వయంగా అడగడంతో చంద్రబాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది. టిడిపికి ఉన్న ఒక్క స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్నది చంద్రబాబుకు కత్తి మీద సామే. చాలామంది సీనియర్లు రాజ్యసభ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. తమకు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తాము చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు.
* త్యాగశీలులు ఇలా
అయితే ఈ ఎన్నికల్లో చాలామంది త్యాగాలు చేశారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఇబ్బంది పడ్డారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన ఆయన అప్పట్లో రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు. అందుకే ఈ ఎన్నికల ముందు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీతోనే కొనసాగుతున్నారు. అందుకే ఆయనకు పెద్దల సభకు చంద్రబాబు పంపిస్తారని ప్రచారం నడిచింది.మరోవైపు దేవినేని ఉమ సైతం రాజ్యసభ పదవి ఆశిస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం మైలవరం టికెట్ వదులుకున్నారు ఉమా. రెండుసార్లు నామినేటెడ్ పదవులను ప్రకటించారు. అందులో ఉమాకు చోటు దక్కలేదు. దీంతో రాజ్యసభ చాన్స్ ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ రోజురోజుకు సమీకరణలు మారుతున్నాయి.
* పెద్దరికాన్ని గౌరవించాల్సిందే
మరోవైపు పార్టీలో సీనియర్లుగా ఉన్న యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజుల సైతం రాజ్యసభ పదవులను ఆశిస్తున్నారు. తమ పెద్దరికానికి గౌరవించి పదవులు కేటాయించాలని కోరుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపికి ఒకటే రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉంది. ఆ సీటును నందమూరి కుటుంబానికి ఇవ్వాలని చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో టీడీపీలో సీనియర్లు తీవ్ర నైరాస్యంలోకి వెళ్లిపోయారు. తమ త్యాగాలకు తగ్గట్టు పదవులు రాకపోవడం పై అసంతృప్తితో ఉన్నారు. అయితే అధినేత తీరును బాహటంగా వ్యతిరేకత వ్యక్తం చేయకపోయినా.. లోలోపల మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరి ఆ అసంతృప్తి ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.