MLA Kolikapoodi Srinivasa Rao : కూటమి ఎమ్మెల్యేల తీరు రోజురోజుకు శృతిమిస్తోంది. నాయకత్వానికి తలవంపులు తెచ్చిపెడుతోంది. హై కమాండ్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై సస్పెన్షన్ వేటు పడింది. సొంత పార్టీకి చెందిన మహిళా నేతపై లైంగిక వేధింపులకు గురి చేశారు అన్నది ఆయనపై వచ్చిన ఆరోపణ. బాధిత మహిళ వీడియోలతో జతచేసి హై కమాండ్ కు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో సైతం విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టిడిపి హై కమాండ్ సదరు ఎమ్మెల్యే పై సస్పెన్షన్ వేటు వేసింది. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వైద్యుడిపై దుర్భాషలు ఆడారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో ఎమ్మెల్యే పై సొంత పార్టీ నేతల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యేల తీరుపై ముప్పేట విమర్శలు ఎదురవుతున్నాయి.
* ఆది నుంచి దూకుడే
తిరువూరు ఎమ్మెల్యే తీరుతో ఓ సర్పంచ్ భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఎన్నికల్లో తిరువూరు నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు కొలికిపూడి శ్రీనివాసరావు. ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అయితే గెలిచిన నాటి నుంచి దూకుడుగా ఉన్నారు. ఓ వైసీపీ నేత ఇంటి నిర్మాణం విషయంలో అతిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే తానే స్వయంగా ఉండి ఆ నిర్మాణాలు తొలగించడం వివాదాస్పదంగా మారింది. ప్రజల్లో విమర్శలకు దారితీసింది.
* మహిళా సంఘాలపై అనుచిత ప్రవర్తన
మధ్యలో డ్వాక్రా సంఘాల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కొలికపూడి. ఏకంగా కొన్ని గంటల పాటు డ్వాక్రా మహిళలు పోలీస్ స్టేషన్లో ఉంచేలా ఆదేశాలు ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వెంటనే స్పందించారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యే శ్రీనివాసరావును పిలిచి క్లాస్ పీకారు. ఎమ్మెల్యే తీరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం అయ్యే అవకాశం ఉందని టిడిపి ఆందోళన చెందింది. ఈ విషయంలో స్వయంగా సీఎం చంద్రబాబు కలుగజేసుకున్నారు. ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.
* ఆ మాటలతో మనస్థాపం
అయితే తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి తీరుతూ టిడిపి సర్పంచ్ భార్య ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సదరు సర్పంచ్ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డారు. శ్రీనివాసరావు గెలుపునకు దోహదపడ్డారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఆ సర్పంచ్ ను దూరం పెట్టారు. ఇప్పుడు అదే సర్పంచ్ పేకాడుతూ పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ కనిపిస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు సర్పంచ్ కుటుంబ సభ్యులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వీఆర్వో గా పని చేస్తున్న సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేవలం ఎమ్మెల్యే తీరుతోనే పార్టీ నేత కుటుంబానికి పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై పార్టీ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తుందో చూడాలి.