Demolition Of Ayyanna Patrudu House: మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి ప్రహరీ గోడ కూల్చివేతను తక్షణం నిలిపివేయాని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఆ సమయంలో కూల్చివేతలు చేపట్టడం ఏంటని అధికారులను నిలదీసింది. సూర్యాస్తమయం తరువాత కూల్చివేతలు చేపట్టరాదని న్యాయస్థానం మార్గదర్శకాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించడం.. ఇదేం పద్ధతి అని అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదులకు స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘించి కూల్చివేతలను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీ రమేశ్ ఆదివారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత ప్రక్రియను నిలువరించాలని కోరుతూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారులు చింతకాయల విజయ్, రాజేశ్ ఆదివారం అత్యవసరంగా హైకోర్టులో (హౌజ్ మోషన్) పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వీవీ సతీశ్ వాదనలు వినిపించారు. అధికారులు ఆమోదించిన ప్లాన్‌కి అనుగుణంగానే పిటిషనర్లు ఇంటి నిర్మాణం చేశారు. ఇరిగేషన్ అధికారులు, తహశీల్దార్ హద్దులు నిర్ణయించాకే ఇంటి నిర్మాణం చేపట్టారు. కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించకుండా రాజకీయ కక్షతో, నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టారు అని వాదనలు వినిపించారు. న్యాయమూర్తి స్పందిస్తూ… అర్ధరాత్రి కూల్చివేతలు ఏంటంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ… ఇప్పటికే కొంత భాగం ప్రహరీ గోడను కూల్చివేశారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలి అని కోరారు.
స్పందించిన అధికారులు
ఇదిలా ఉంటే అయ్యన్న ఇంటి గోడ కూల్చివేతపై ఇరిగేషన్ అధికారులు స్పందించారు. రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ ఛానెల్, నీలంపేట ఛానెల్, నర్సీపట్నం పట్టణ పరిధిలోని శివపురం దగ్గర నీలంపేట ఛానెల్ కు సంబంధించి ఇరిగేషన్ శాఖ గోడలు నిర్మించింది. అయితే.. సరిగ్గా ఈ గోడ కట్టిన చోటే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి నిర్మాణం చేశారన్నది ప్రధాన ఆరోపణ.. ఆ ఆరోపనలు నిజమే అంటూ.. ఇరిగేషన్ శాఖ గోడలపైనే అయ్యన్న పాత్రుడు బేస్ మెంట్ నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఛానెల్ ఒడ్డున ఉన్న నదిలోకి పది అడుగుల వరకు ఆక్రమించారని ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆక్రమణకు సంబంధించిన ఫోటోలను కూడా ఇరిగేషన్ శాఖ విడుదల చేసింది.
టీడీపీ నేతల ఆగ్రహం
అయ్యన్నపాత్రుడి విషయంలో వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని చంద్రబాబు ఆరోపించారు. ఇది గొంతు నొక్కే ప్రయత్నమేననన్నారు. ఇందుకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇటువంటి చర్యలకు దిగుతోందని విమర్శించారు. ఈ ఘటనపై జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పులి భయపడిందని అన్నారు. నోటీసులిస్తామంటూ పోలీసులు అరెస్టు డ్రామా.. దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే గట్టగానే భయపడినట్లు కనిపిస్తోందని అన్నారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనజాతర.. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చూసి జడుసుకుని పిరికిపందచర్యలు మొదలుపెట్టారని అన్నారు. మూడేళ్ల తర్వాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టు చేయడంలాంటి చర్యలకు పాల్పడుతున్న జగన్‌రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తోందన్నారు. గతంలో వైసీపీ నేతల తిట్ల దండకాలను ప్రస్తావిస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాగా టీడీపీ చలో నర్సీపట్నం కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
ఖండించిన మంత్రి..
తెలుగు దేశం పార్టీ నేతల విమర్శలను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఖండించారు. అయ్యన్నపాత్రుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. చంద్రబాబు అసలు ఏ పార్టీ నుండి వచ్చారు? టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీని కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు. పార్టీని, బ్యాంకు బ్యాలెన్స్ కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబని.. అందుకే పార్టీ నేతలు కూడా అదే బాటలో నడుస్తున్నారని విమర్శించారు.
Also Read: Prakash Raj About Sai Pallavi: దుమ్మురేపుతున్న సాయిపల్లవి వ్యాఖ్యలు.. ఆమెకు మద్దతుగా ప్రకాశ్ రాజ్