TDP: ఏపీలో ( Andhra Pradesh)కూటమి అధికారంలో ఉంది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం పై సానుకూలంగా వ్యవహరిస్తున్న కొన్ని మీడియా సంస్థలు.. జనసేన విషయానికి వచ్చేసరికి ఒకలా.. బిజెపి విషయానికి వచ్చేసరికి మరోలా కథనాలు రాస్తున్నాయి. ముఖ్యంగా జనసేన ను డామేజ్ చేసేలా వ్యవహరిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేక ప్రచారం జరిగినప్పుడు సాక్షి ఆ పార్టీకి అండగా నిలబడుతోంది. టిడిపికి డ్యామేజ్ జరిగినప్పుడు ఎల్లో మీడియా అండగా వస్తోంది. కానీ అదే ఎల్లో మీడియా టిడిపికి మిత్రపక్షంగా ఉన్న జనసేన విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే జనసేన వద్దు.. టిడిపియే ముద్దు అన్నట్టు ఆ సెక్షన్ ఆఫ్ మీడియా పరిస్థితి ఉంది.
* కిరణ్ రాయల్ పై అలా..
తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్( Kiran rayal ) వివాదాన్ని తీసుకుందాం. ఆ సమయంలో ఎల్లో మీడియా ఆయనపై పతాక స్థాయిలో కథనాలు రాసింది. ఆయన చేసింది తప్పే. ఒక బాధితురాలిని మోసం చేయడానికి ఎవరు వెనుకేసుకు రారు. అయితే కిరణ్ రాయల్ మాత్రం జనసేన వాయిస్ బలంగా వినిపించేవారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టిడిపి శ్రేణులు కోరితే.. పవన్ కళ్యాణ్ ను ఈ రాష్ట్రానికి సీఎం చేయాలని కోరిన మొదటి జనసేన నేత కిరణ్ రాయల్ మాత్రమే. అందుకే కిరణ్ రాయల్ విషయంలో ఎల్లో మీడియా కాస్త అతిగానే స్పందించినట్లు అర్థమవుతోంది.
* పవన్ దిద్దుబాటు చర్యలు..
తాజాగా ప్రత్తిపాడు జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ తమ్మయ్య బాబు( Tammayya babu )మహిళా వైద్యురాలి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దురుసుతనం ప్రదర్శించారు. అందరి ముందు అవమానించేలా వ్యవహరించారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ శరవేగంగా స్పందించారు. తమ్మయ్య బాబు చర్యలను ఖండిస్తూ ఆయనను సస్పెండ్ చేశారు. నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించారు. వాస్తవానికి ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూస్తే.. చాలా పార్టీలు పెద్దగా పట్టించుకోవు. కానీ ఈ విషయంలో పవన్ చర్యలను ఎవరైనా అభినందించాల్సిందే. అయితే పవన్ చర్యలను కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా పట్టించుకోకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
* సమర్థనీయం కాదు కానీ..
ఆసుపత్రికి వచ్చి జనసేన నేత ( Jana Sena leader )రచ్చ చేయడం చాలా తప్పు. దానిపై నివేదిక తెప్పించుకున్నారు పవన్ కళ్యాణ్. ఎక్కడ అయితే ఆ మహిళా డాక్టర్కు అవమానం జరిగిందో.. అక్కడికే వైద్యురాలి తల్లిని రప్పించడం.. అందరి ఎదుట క్షమాపణలు చెప్పించడం.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం చిన్న విషయం కాదు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చర్యలను ఎవరైనా ఆహ్వానించాలి. ప్రత్యేకంగా మీడియాలో ప్రస్తావించాలి. కానీ జనసేన రచ్చను మాత్రమే చూపి.. అధినేత సత్వర స్పందనను మాత్రం ప్రస్తావించకపోవడం ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఆలోచనను తెలియజేస్తోంది. అయితే ఈ విషయంలో పవన్ పై పొగడ్తలు కంటే.. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మీడియా పై ఉంది. పైగా టిడిపి కూటమి అనుకూల మీడియా గా ముద్ర ఉంది. కానీ జనసేనతో పాటు పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం వారి ఆలోచన వేరేలా ఉంది.