YCP MP Candidates: ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి జాబితాలను రూపొందించే పనిలో పడ్డారు. ఇప్పటికే రెండు జాబితాలను ప్రకటించారు. మొత్తం 38 మందిని మార్చారు. కొందరు మంత్రులకు ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా షిఫ్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమందిని పక్కన పెడుతున్నారు. వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు సాగుతున్న జగన్.. సంక్రాంతి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ముందుగా లోక్ సభ స్థానాలను ప్రకటించి.. తరువాత అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
సంక్రాంతి నుంచి ప్రతి అభ్యర్థి ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అవకాశాలు దక్కని వారికి ఎమ్మెల్సీ, రాజ్యసభ, భవిష్యత్తులో పదవులపై హామీ ఇస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల విషయంలో దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు మినహా అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారు అయినట్లేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తూ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి దానేటి శ్రీధర్, కిల్లి కృపారాణి, పిరియా విజయల్లో ఒక్కరికి అవకాశం దక్కనుందని తెలుస్తోంది. విజయనగరం పార్లమెంట్ స్థానానికి మజ్జి శ్రీనివాసరావు పేరు ఖరారు అయింది. విశాఖ పార్లమెంట్ స్థానం మంచి బొత్స ఝాన్సీ లక్ష్మి బరిలో దిగే అవకాశం ఉంది. అరకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అనకాపల్లి నుంచి కరణం ధర్మశ్రీ అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు తెలుస్తోంది. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి చలమశెట్టి సునీల్ లేదా ముద్రగడ పద్మనాభం, అమలాపురం నుంచి ఎలీజా, రాజమండ్రి నుంచి డాక్టర్ అనుసూరి పద్మలత, నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు, శ్రీ రంగనాథరాజులో ఒకరికి ఎంపిక చేయనున్నారు, ఏలూరు నుంచి అరసవిల్లి అరవింద్ తో పాటు మరో మాజీ మంత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి స్థానంలో డైరెక్టర్ వివి వినాయక్, కేశినేని నాని చేరికతో విజయవాడ ఎంపీ స్థానాన్ని పెండింగ్ లో పెట్టారు. గుంటూరు, నరసరావుపేట స్థానాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల నిర్ణయానికి అనుగుణంగా ఖరారు చేయనున్నారు. బాపట్ల నుంచి నందిగామ సురేష్, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు లేదా ఆయన కుమారుడు, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి లేదా సినీ నటుడు అలీ పేరు వినిపిస్తోంది.
కర్నూలు పార్లమెంట్ స్థానానికి గుమ్మనూరు జయరాం పేరును ఖరారు చేశారు. అనంతపురం నుంచి శంకర్ నారాయణ, హిందూపురం నుంచి శాంతమ్మ, కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, తిరుపతి నుంచి డాక్టర్ గురుమూర్తి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, చిత్తూరు నుంచి రెడ్డప్ప పేర్లు ఖాయం చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ముందే ఈ జాబితాను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.