AP Pensions: జూన్ నెల పింఛన్లకు లైన్ క్లియర్.. అకౌంట్లో పడేది అప్పుడే! కానీ ట్విస్ట్ ఇదే

ఏప్రిల్ నెలకు సంబంధించి పింఛన్లను గ్రామ సచివాలయాల వద్ద పంపిణీ చేశారు. మే నెలలో మాత్రం ఎకౌంట్లో డబ్బులు వేశారు. ఈసారి కూడా బ్యాంక్ అకౌంట్ లలో పింఛన్ నగదు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Written By: Dharma, Updated On : May 29, 2024 9:26 am

AP Pensions

Follow us on

AP Pensions: ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ పై క్లారిటీ వచ్చింది. జూన్ నెలకు సంబంధించి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు పింఛన్ అందించేవారు. మార్చిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటన నేపథ్యంలో.. వాలంటీర్లను పింఛన్ల పంపిణీ సేవల నుంచి తప్పించారు. ఇది వివాదంగా మారింది. చాలామంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అధికార పార్టీ ఆదేశాల మేరకు విధులకు దూరమయ్యారు. అక్కడి నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.

ఏప్రిల్ నెలకు సంబంధించి పింఛన్లను గ్రామ సచివాలయాల వద్ద పంపిణీ చేశారు. మే నెలలో మాత్రం ఎకౌంట్లో డబ్బులు వేశారు. ఈసారి కూడా బ్యాంక్ అకౌంట్ లలో పింఛన్ నగదు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటో తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ మొత్తం జమ కానుంది. దీంతో పండు టాకులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఉపశమనం లభించినట్టే. అయితే ఎనిమిది పదులు వయసు దాటిన వృద్ధులకు, మంచం పై ఉండే వారికి ఇంటికి వచ్చి పింఛన్ మొత్తాన్ని అందించనున్నారు.

గత ఐదు సంవత్సరాలుగా వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పింఛన్లు అందించేవారు. ఎన్నికల నేపథ్యంలో వారి సేవలను నిలిపివేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో జాప్యం జరిగింది. ఈ విషయంలో అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు కొనసాగాయి. వాలంటీర్ ప్రక్రియ నిలిచిపోవడానికి చంద్రబాబు కారణమని వైసిపి ఆరోపించింది. పింఛన్ల పంపిణీని ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశారని.. ప్రభుత్వం తలచుకుంటే గంటల వ్యవధిలో పింఛన్లు అందించవచ్చని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం చేతులెత్తేసింది అంటూ చంద్రబాబు తిరిగి ఆరోపించారు. ఎన్నికల సమయంలో పింఛన్ల రగడ ఎక్కువగా కొనసాగింది. ప్రచారంలో సైతం అదే కీలకంగా మారింది. కానీపోలింగ్ ముగియడంతో పింఛన్ల పంపిణీ పై రాజకీయ పార్టీలు మాట్లాడడం మానేశాయి. అటు ప్రభుత్వం సైతం ముందుగానే స్పష్టమైన ప్రకటన చేసింది. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో పింఛన్ లబ్ధిదారులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.