https://oktelugu.com/

AI Campain : ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్స్ పెంచేందుకు AIని వాడారు! ఆ వీడియో చూడాల్సిందే

ఈ క్రమంలో ఈ ఏడాది ఏఐ ఆధారిత ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఇది తల్లిదండ్రులను ఆకట్టుకుంటుందని చెప్పారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 29, 2024 / 09:25 AM IST

    AI Campaign

    Follow us on

    AI Campain : మరో 12 రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహిస్తున్నారు. జూన్‌ 1 నుంచి బడిబాట కార్యక్రమం చేపట్టాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే అందరిలా ప్రచారం చేస్తే కొత్తదనం ఏముంటుంది అనుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వట్టెంల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సూర్యనారాయణ. ప్రచారంలో కొత్తదనం ఉండాలని భావించారు. తన ఆలోచనను అమలులో పెట్టారు. సోషల్‌ మీడియాను ఇందుకు వేదికగా చేసుకుని ఏఐ(ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌) ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకత గురించి ప్రచారం నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నారు.

    కుమార్తె సహాయంతో..
    తమిళనాడులోని కాంచిపురం ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న సూర్యనారాయణ కూతురు వేసవి సెలవులు కోసం ఇంటికి వచ్చింది. ఈ సందర్భంగా ఏఐ గురించి ఇద్దరూ చర్చించారు. ఈ క్రమంలోనే సూర్యనారాయణకు ప్రభుత్వ పాఠశాలల గురించి ప్రచారం ఏఐ సహాయంతో చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను కూతురుకు చెప్పడంతో ఆమె ప్రభుత్వ పాఠశాలల గురించిన ఏఐ సహాయంతో ఒక వీడియో రూపొందించింది. దీనిని సూర్యనారాయణ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో వేములవాడ సమీపంలోని వట్టెంల జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదువుకోవడం వలన కలిగే ప్రయోజనాలను ఏఐ సహాయంతో ఒక యాంకర్‌ వివరిస్తుంది. ఇందుకోసం కంప్యూటరైజ్డ్‌ అవతార్‌ అయిన ‘వర్చువల్‌ ఏఐ యాంకర్‌’ని రూపొందించినట్లు పేర్కొన్నారు.

    యాంకర్‌ చెప్పిన విషయాలు..
    ఇక ఏఐ యాంకర్‌ వట్టెంల పాఠశాల గురించి వివరిస్తూ ఇంగ్లిష్‌ మీడియం బోధన, అర్హత గల ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాం, డిజిటల్‌ పాఠాలు వంటి ముఖ్యమైన అంశాలను తెలుగులో స్పష్టంగా వివరిస్తుంది. పదో తరగతి ఫలితాల్లో వట్టెంల పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించిన విషయాన్ని వెల్లడించింది.

    ప్రవేశాలు పెంచడానికే..
    పాఠశాలలో ప్రవేశాలు పెంచడానికే తాను ఏఐ ఆధారిత ప్రచారం మొదలు పెట్టినట్లు సూర్యనారాయణ తెలిపారు. తాను 2018లో ఈ పాఠశాలకు వచ్చినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఏటా విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఏఐ ఆధారిత ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఇది తల్లిదండ్రులను ఆకట్టుకుంటుందని చెప్పారు.