AP alliance election campaign plans: కర్ణుడు పెళ్ళికి సవాలక్ష కారణాలు అన్నట్టు మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ( land titling act ) అనేది దారుణంగా దెబ్బతీసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్లో పట్టాదారు పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం ఎప్పుడూ లేదు. కానీ తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడంతో ప్రజల్లో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడింది. దానిని హైలెట్ చేసుకుంటూ ముందుకు సాగింది కూటమి. ప్రజల్లో బలమైన చర్చ జరిగేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ప్రజల్లోకి ఆ అంశం బలంగా వెళ్లడం.. బాహాటంగా వ్యతిరేకించడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ ఓటమి ఎదురైంది. ముఖ్యంగా తటస్తులు, ఏ పార్టీతో సంబంధం లేని వారు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను దారుణంగా వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి పై ఉన్న భయంతో కూటమి పార్టీలకు ఓటు వేశారు.
మారిన సీన్..
అయితే ఇప్పుడు సీన్ మారింది. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది. గతంలో కూటమి పట్టుకున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాదిరిగా.. కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని పట్టుకోవాలని చూస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ కూటమి పట్టు చిక్కడం లేదు. దీంతో ఎంతవరకు కాపు రాజకీయం, అంబటి రాంబాబు లాంటి వారిపై కేసులతో ఇబ్బంది పెడుతున్నారని.. వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని.. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లే బలమైన ఆయుధాన్ని మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుకోలేకపోతోంది. ఇది నిజంగా ఆ పార్టీకి లోటు. అయితే అధికారపక్షంగా ఉన్న కూటమి ఎన్నికలకు అవసరమైన ప్రచార అస్త్రాలను ఇప్పటికే సంపాదించుకుంది. వాటితోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తోంది.
అప్పటివరకు సజీవంగా కల్తీ వ్యవహారం..
టీటీడీ ( Tirumala Tirupati Devasthanam)లడ్డు తయారీకి సంబంధించి నెయ్యి కల్తీ వ్యవహారం.. వచ్చే ఎన్నికల వరకు సజీవంగా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నెయ్యి కల్తీ జరిపారు అన్నది ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. కానీ ఎంతవరకు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు జంతు కొవ్వు కలపలేదు కదా అని ప్రశ్నిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ పామాయిల్ తో కూడిన రసాయనాలతో నెయ్యి తయారు చేశారని.. అసలు పాలతో తయారుచేసిన నెయ్యి కాదని సిట్ తేల్చింది. ఎంతవరకు జంతు కొవ్వు అన్న ఆరోపణ చేశారు కాబట్టి.. అందులో కలపలేదని సిట్ తేల్చింది కాబట్టి తామేదో బయటపడ్డామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ వైసీపీ హయాంలో తప్పు జరిగిందని మెజారిటీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే ఈ అంశాన్ని సజీవంగా ఉంచాలని భావిస్తోంది కూటమి. వచ్చే ఎన్నికల్లో ఇదొక ప్రచార అస్త్రంగా మారుతుందని భావిస్తోంది.
హిందుత్వవాదం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని హిందుత్వవాదంతో వచ్చే ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తోంది కూటమి. అందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది. ప్రస్తుతం వివిధ పీఠాధిపతులు, హిందూ మతానికి చెందిన పెద్దలు మీడియా ముందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఏకంగా చిన్న జీయర్ స్వామి లాంటివారు అమరావతిని మార్చాలని కొందరు ప్రయత్నించారని.. భగవంతుడే కాపాడుకున్నాడంటూ వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హిందుత్వవాదం ఎక్కడ వినిపిస్తే అక్కడ బిజెపి అనుబంధ సంస్థలు వాలిపోతాయి. ఇప్పుడు కేంద్రంలో బిజెపి నేతృత్వంలో ప్రభుత్వం పవర్ఫుల్ గా ఉంది. కచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి హిందుత్వవాదం అనేది ఏపీలో కచ్చితంగా ప్రభావం చూపుతుంది.
మరో రెండు అంశాలు..
మరోవైపు బీసీ రిజర్వేషన్ల( BC reservation ) అంశం అనేది కూటమికి ఒక ప్రచార అస్త్రంగా మారనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసి ప్రజల్లోకి బలంగా వెళ్లనుంది కూటమి. 2021లో వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీసీ రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చిక్కింది. కానీ ఆ పని చేయలేదు. పైగా బీసీ వాదంతో ముందుకెళ్లిన జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడించారు బీసీలు. ఇప్పుడు రిజర్వేషన్లు ఖరారు చేయడం ద్వారా బీసీలను శాశ్వతంగా తనవైపు ఉంచుకోవాలని కూటమి బావిస్తోంది. మరోవైపు మద్యం కుంభకోణం కేసును సైతం చివరి వరకు తీసుకెళ్లేందుకు కూటమి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సగం మాత్రమే దర్యాప్తు జరిగిందని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. తద్వారా ఇదో ఎన్నికల అస్త్రంగా మారనుంది. ప్రతిపక్షానికి అవసరమైన ఎన్నికల అస్త్రాలు సమకూరుతాయి. కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా అధికార పక్షానికి చిక్కడం విశేషం.