Free Gas Cylinder Booking : ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఇలా!

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. మరో రెండు రోజుల్లో ఈ పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

Written By: Dharma, Updated On : October 29, 2024 4:21 pm

Free Gas Cylinder Booking

Follow us on

Free Gas Cylinder Booking :  సూపర్ సిక్స్ పథకాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు తొలి అడుగు వేసింది. ఈ దీపావళి నుంచి పథకం అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈరోజు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి బుకింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించింది. సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం సోంపేట లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్న నేపథ్యంలో పథకం అమలుకు శరవేగంగా అడుగులు వేసింది కూటమి ప్రభుత్వం.అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించింది. ఈ పథకానికి ఏటా రూ.2684.75 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అందులో తొలి విడతగా రూ.894.92 కోట్లను విడుదల చేసేందుకు నిన్ననే అనుమతి ఇచ్చింది కూటమి సర్కార్. ఈనెల 31న సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించగానే.. రాష్ట్రవ్యాప్తంగా తొలి సిలిండర్ ఇళ్లకు డెలివరీ ప్రారంభం కానుంది. కాగా వీటికి సంబంధించి బుకింగ్స్ ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో సిలిండర్లు ఎలా బుక్ చేసుకోవాలన్నది సూచిస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్లను తమ గ్యాస్ కంపెనీ వెబ్ సైట్ లో కానీ.. మొబైల్ ఫోన్లో ఐవిఆర్ నెంబర్ కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా కానీ.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే లో కానీ.. వాట్సాప్ లో కానీ.. గ్యాస్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ వద్ద కానీ బుక్ చేసుకోవచ్చు.

* ఆ ప్రక్రియ ఇలా
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత లబ్ధిదారుడి ఫోన్ నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది. గ్యాస్ డీలర్ వద్ద సిలిండర్ డెలివరీ కోసం బిల్ జనరేట్ అవుతుంది. సిలిండర్ లబ్ధిదారుడికి డెలివరీ చేసేటప్పుడు ఫోన్ కు ఓటిపి వస్తుంది. అది చెప్తే డెలివరీ బాయ్స్ సిలిండర్ ఇస్తారు. సిలిండర్ డెలివరీ తర్వాత డిస్టిబ్యూటర్ వెబ్సైట్లో ఈ వివరాలు అప్లోడ్ చేస్తారు. వెంటనే లబ్ధిదారుడికి సిలిండర్ డెలివరీ అయినట్లు మరో మెసేజ్ వెళుతుంది. ఆ తరువాత 24 గంటల్లో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మొత్తం లబ్ధిదారుడి ఖాతాలో జమ కానుంది.

* ప్రతి కుటుంబానికి లబ్ది
గ్యాస్ ఉచిత పంపిణీ తో పేద, సామాన్య, మధ్యతరగతి లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 850 రూపాయలుగా ఉంది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అంటే 2500 రూపాయలు లబ్ధి చేకూరినట్టే. ప్రస్తుతం కుటుంబ జీవనం కష్టతరంగా మారిన నేపథ్యంలో పేదలకు అండగా నిలవాలని కూటమి సర్కార్ భావించింది. అందుకే ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో పొందుపరిచింది. అందులో ఇప్పుడు ప్రధాన పథకం గా ఉన్న ఈ ఉచిత గ్యాస్ పంపిణీ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. అటు గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు కూడా.