Anil Kumar Yadav: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చుట్టం చూపుగా నెల్లూరుకు పరిమితం అయ్యారు. దీంతో అక్కడ పరిస్థితులను చక్కదిద్దుతున్నారు ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి. అయితే నిన్న అకస్మాత్తుగా అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యక్షమయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ఓ ఐదుగురు కార్పొరేటర్ లను తిరిగి వైసిపిలో చేర్పించేందుకు రంగంలోకి దిగారు. వారిని జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ కండువాలు కప్పించారు. అయితే ఇప్పటివరకు కనిపించని అనిల్ కుమార్ యాదవ్ సడన్ గా కనిపించేసరికి అక్కడ సీన్ మారినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నెల్లూరు కార్పొరేషన్ పై దృష్టి పెట్టిన నేపథ్యంలో అనిల్ యాదవ్ వచ్చారని అంతా భావించారు. అయితే ఇలా హాజరు కావడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు.
వ్యతిరేకతతో స్థానచలనం..
మొన్నటి ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పి ఆయనను నరసారావు పేట పార్లమెంట్ స్థానానికి పంపించారు. ఎంపీగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ కు లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో ఓటమి తప్పలేదు. అయితే ఓడిపోయిన తర్వాత పొలిటికల్ స్క్రీన్ పై పెద్దగా కనిపించలేదు అనిల్ కుమార్ యాదవ్. అయితే జగన్మోహన్ రెడ్డి తిరిగి నెల్లూరు అసెంబ్లీ స్థానం ఇచ్చేందుకు మొగ్గు చూపకపోవడంతో అనిల్ కుమార్ యాదవ్ తనదారి తాను చూసుకున్నట్లు ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు నేరుగా నెల్లూరు వచ్చి సందడి చేయడంతో కొత్త ప్రచారం మొదలైంది. ఇప్పటికే నెల్లూరు సిటీలో ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి పార్టీ కార్యకలాపాలను చూస్తుండగా.. అనిల్ యాదవ్ ఎందుకు వచ్చారు అన్నది ప్రశ్నగా మిగిలింది.
ఆ బాధ్యతలపై విముఖత..
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట ఇన్చార్జిగా కొనసాగాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ కొనసాగడం అనిల్ కుమార్ యాదవ్ కు ఎంత మాత్రం ఇష్టం లేదట. అయితే అటు ప్రకాశం జిల్లా నుంచి కానీ.. ఇటు గుంటూరు జిల్లా నుంచి కానీ ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారట. ఇకనుంచి నెల్లూరు రాజకీయాల్లో వేలు పెట్టవద్దని సూచించారట. నెల్లూరు చంద్రశేఖర్ రెడ్డి కి విడిచి పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. చివరి నిమిషంలో కూటమి పార్టీల నుంచి చాలామంది నేతలు వస్తారని.. అనిల్ కుమార్ యాదవ్ అయితే అది సాధ్యపడకపోవచ్చు అని భావించి జగన్ దూరం పెట్టినట్లు సమాచారం.
జగన్కు ఆ సమాచారం
గత ఎన్నికలకు ముందు నెల్లూరు పటిష్టమైన స్థానంలో ఉండేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. కేవలం అనిల్ కుమార్ యాదవ్ వైఖరి వల్లే జగన్మోహన్ రెడ్డికి చాలామంది నేతలు దూరమయ్యారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం వెనుక అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సైతం అదే నిర్ణయానికి వచ్చారు. అందుకే అనిల్ కుమార్ యాదవ్ను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తనకు నెల్లూరు తప్ప మరో నియోజకవర్గం సెట్ కాదని అనిల్ కుమార్ యాదవ్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ లో టిడిపి ప్రయత్నాలను అడ్డు చెప్పే ప్రయత్నంలో భాగంగా వచ్చారని తెలుస్తోంది. తనను నెల్లూరులో నియమిస్తే నియమించండి లేకుంటే మీ ఇష్టం అంటూ అనిల్ కుమార్ యాదవ్ అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. మరి జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.