Godavari Pushkaralu: గోదావరి పుష్కరాల( Godavari festivals ) నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుష్కరాల తేదీలను ఖరారు చేసింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరుగుతాయని ప్రకటించింది. ఉత్తర్వులు కూడా జారీచేసింది. తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం ఆధారంగా ఈ ముహూర్తాలను ఖరారు చేసింది. మొత్తం 12 రోజులపాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి. 2027 జూన్ 26 వ తేదీన పుష్కర ప్రవేశం జరగనుంది. జూలై 7న పుష్కర సమాప్తి ఉంటుంది.
ఇంకా 16 నెలలే..
పుష్కరాలకు ఇంకా 16 నెలల కాలం మాత్రమే ఉంది. గత పుష్కరాలు 2015 జూలై 14 నుంచి 25 వరకు నిర్వహించారు. అప్పట్లో మూడు కోట్ల మంది యాత్రికులు వచ్చారు. ఈసారి ఆ సంఖ్య రెట్టింపు కానుంది. గత పుష్కరాలకు సుమారు 1200 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. అప్పట్లో రెండేళ్లు ముందుగానే పనులు చేపట్టారు. ఘాట్ ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చారు. ధవలేశ్వరం నుంచి కాతేరు వరకు 17 ఘాట్ లు ఏర్పాటు చేశారు అప్పట్లో. గంటకు 60 వేల మంది పుష్కర స్నానాలు చేసేలా అప్పట్లో ఏర్పాట్లు జరిగాయి. అయితే అప్పట్లో అంచనాలకు మించి యాత్రికులు వచ్చారు. దాదాపు మూడు కోట్ల మంది యాత్రికులు వచ్చినట్లు అంచనాలు ఉన్నాయి.
6 కోట్ల మంది యాత్రికులు..
అయితే ఈసారి దాదాపు 6 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. 5000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాజమండ్రి నగరపాలక సంస్థ దాదాపు రెండు వేల కోట్లతో పుష్కర ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మంత్రులతో ప్రత్యేక కమిటీని కూడా నియమించింది. మరో ఇద్దరు ప్రత్యేక ఐఏఎస్ అధికారుల నియామకం కూడా పూర్తయింది. అయితే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేయగా.. మంత్రులతో పాటు అధికారులు అటువైపు వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. క్షేత్రస్థాయి సందర్శనలు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. గత అనుభవాల దృష్ట్యా పక్కాగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా పుష్కరాల నిర్వహణకు సహకారం అందుతుంది. ముఖ్యంగా రైల్వే శాఖ రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. పనులు శరవేగంగా జరిపిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు ముహూర్తం కూడా ఫిక్స్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ పరంగా పనులు వేగవంతం కానున్నాయి.