Visakhapatnam: మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని రకాల కొత్త చట్టాలను అందుబాటులోకి తెస్తున్నా.. కామాంధుల ఆగడాలు తగ్గడం లేదు. అంతకంతకు రెచ్చిపోతున్నారు. అయినవారే లైంగిక దాడులు చేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కాటు వేస్తున్నారు. తాజాగా విశాఖ నగరంలో ఇటువంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. కన్న తండ్రే కుమార్తె పై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులందరినీ చంపేస్తానని బ్లాక్ మెయిల్ కి దిగి లోబరుచుకునేవాడు. అతడి చర్యలతో విసిగివేసారిన కుమార్తె ధైర్యం పోగుచేసుకుని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
విశాఖ నగరంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఆయనకు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం కుమార్తె డిగ్రీ చదువుతోంది. ఎప్పటినుంచో కూతురిపై కన్నేసిన తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో శారీరకంగా హింసించడం ప్రారంభించాడు. తరచూ చేయి చేసుకునేవాడు. భార్య, కుమారుడు ఇంట్లో లేని సమయం చూసి అత్యాచారం చేసేవాడు. తల్లికి, తమ్ముడికి చెబితే అందర్నీ కలిసి చంపేస్తానని హెచ్చరించేవాడు. దీంతో ఆమె మౌనంగా భరించేది. లోలోపల కుమిలిపోయేది.
ఈ తరుణంలో శుక్రవారం తండ్రి మరోసారి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ధైర్యం తెచ్చుకున్న బాధితురాలు తండ్రి పై తిరగబడింది. అతని దుర్మార్గపు చర్యలను తల్లికి వివరించింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మల్కాపురం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కీచక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటువంటి మానవ మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల ప్రతినిధులు పోలీసులను కోరుతున్నారు.