TDP Party : ఏపీలో చాలామంది టిడిపి నాయకులు అసంతృప్తితో ఉన్నారు.కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది. ఇంతవరకు తమకు పదవి యోగ్యత దక్కలేదని వారిలో బాధ వ్యక్తం అవుతోంది.ఇప్పటివరకు రెండు జాబితాల నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేశారు. రాజ్యసభ పదవులకు ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. కానీ ఎక్కడా తమ పేరు వినిపించకపోవడంతో వారు పడుతున్న బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా విజయవాడ నుంచి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న,మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ,మరో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్,పిఠాపురం నుంచి వర్మ పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.కానీ వారి పేరు ఎక్కడా వినిపించడం లేదు. దీంతో తమకు పదవులు వస్తాయా? రావా? అన్న బాధ వారిని వెంటాడుతోంది. పార్టీ కోసం కష్టపడి పని చేశామని ఒకరు, పొత్తుల కోసం సీట్లు త్యాగం చేశామని మరొకరు, వైసిపి ప్రభుత్వ దాడులను ఎదుర్కొన్నామని ఇంకొకరు.. ఇలా ప్రతి ఒక్కరూ తమలో ఉన్న బాధను వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితిని తలుచుకొని ఆవేదనతో ఉన్నారు. పదవుల కోసం గంపెడాశలు పెట్టుకున్నారు.
* బలమైన వాయిస్
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలమైన వాయిస్ వినిపించడంలో బుద్దా వెంకన్న ముందు వరుసలో ఉండేవారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకన్నకు ఎమ్మెల్సీ ఛాన్స్ వచ్చింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎమ్మెల్సీగా కొనసాగారు. వైసిపి ప్రభుత్వ విధానాలను టార్గెట్ చేసేవారు. ఈ క్రమంలో అప్పటి వైసిపి ప్రభుత్వానికి తిరిగి టార్గెట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకటి రెండుసార్లు వైసిపి నేతల ఎటాక్ లో కూడా చిక్కుకున్నారు బుద్దా వెంకన్న. అయినా ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. బలమైన వాయిస్ వినిపించ గలిగారు. ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ సీటు కానీ, విజయవాడ పశ్చిమ అసెంబ్లీ టికెట్ దక్కుతుందని భావించారు.కానీ నిరాశ ఎదురయింది.కనీసం ఎమ్మెల్సీ గా కానీ.. రాజ్యసభ పదవికి కానీ ఎంపిక చేస్తారని ఆశించారు. తన పేరును కనీస స్థాయిలో కూడా పరిగణలో లేకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
* రాధాకృష్ణది అదే పరిస్థితి
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పరిస్థితి అలానే ఉంది.బలమైన కుటుంబ నేపథ్యమున్న రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో గత ఐదేళ్లుగా కొనసాగుతున్నారు.ఈ ఎన్నికల్లో టికెట్ రాకున్నా పార్టీ కోసం పనిచేశారు.2019 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. ఎటువంటి పదవులు ఆశించకుండా పనిచేశారు. ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. అయినా సరే పార్టీని ఎన్నడు వీడలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో రాధాకృష్ణకు పదవి ఖాయమని తేలింది. అయినా సరే ఇటీవల ఆయన పేరు ఎక్కడా కనిపించడం లేదు.దీంతో ఆయన సైతం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
*ఆవేదనతో మాజీ ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సైతం ఆవేదనతో ఉన్నారు.2014లో వైసీపీ తరఫున గెలిచారు జలీల్ ఖాన్.చంద్రబాబు పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.అయినా సరే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు.ఈ ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే ఛాన్స్ దక్కలేదు.దీంతో నామినేటెడ్ పదవి దక్కుతుందని భావించారు జలీల్ ఖాన్.కానీ ఎక్కడా ఆయన పేరు వినిపించడం లేదు.దీంతో ఆయన సైతం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం.
*పాపం పిఠాపురం వర్మ
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.ఈ ఎన్నికల్లో పవన్ కోసం ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.పవన్ గెలుపు కోసం కృషి చేశారు.అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు.రాష్ట్రంలో భర్తీ చేసే తొలి ఎమ్మెల్సీ పదవి మీదేనంటూ నాడు హామీ ఇచ్చారు.కానీ ఇప్పుడు కనీస స్థాయిలో కూడా ఆయన పేరును పరిగణలోకి తీసుకోవడం లేదు.ఇంకోవైపు పిఠాపురంలో సైతం ఆయనకు జనసేన నాయకులు పెద్దగా గౌరవం ఇవ్వడం లేదు.టిడిపి శ్రేణుల విషయంలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.కనీసం నామినేటెడ్ పదవి ఇవ్వలేదు సరి కదా.. ఎమ్మెల్సీ గానైనా ఛాన్స్ ఇస్తారని ఎదురుచూస్తున్నారు వర్మ. దీంతో ఆయనలో సైతం ఒక రకమైన బాధ వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం టిడిపిలో ఈ నలుగురు నేతలుఅసంతృప్తితో ఉన్నారు.మరి హై కమాండ్ ఎలాంటి న్యాయం చేస్తుందో చూడాలి.