TTD Trust Board : భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. ఇకపై భక్తులు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన పోటు సిబ్బంది నియామకానికి సిద్ధమవుతోంది.టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలతో పాటుగా 6000 పెద్ద లడ్డూలు తయారు చేస్తోంది. వీటికి అదనంగా 3,500 వడలు అందుబాటులోకి తెస్తోంది. లడ్డు ప్రసాదాలను తిరుమలతో పాటుగా తిరుపతిలోని స్థానిక ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, అమరావతి, కడప ఒంటిమిట్ట ఆలయంలో విక్రయిస్తున్నారు.తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భక్తులకు ఒక చిన్న లడ్డును ఉచితంగా ఇస్తారు.రోజుకు సుమారు 70000 మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు.అంటే ఈ లెక్కన 70000 లడ్డూలు భక్తులకు అందించాల్సి ఉంటుంది.వీటితో పాటుగా భక్తులకు అదనంగా శ్రీవారి ప్రసాదాన్ని ఇచ్చేందుకు లడ్డూలను కొనుగోలు చేస్తుంటారు.ఇక వారాంతం,ప్రత్యేక పర్వదినాలు,బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డు ప్రసాదాలకు డిమాండ్ ఉంటుంది. అందుకే ఇకనుంచి టీటీడీఅదనంగా మరో 50 వేల చిన్న లడ్డూలు,నాలుగు వేల పెద్ద లడ్డూలు,3500 వడలు తయారు చేయాలని నిర్ణయించింది టీటీడీ.
* అదనపు సిబ్బంది నియామకం
తిరుమలలో లడ్డూ తయారీని పరమ పవిత్రంగా భావిస్తారు.నాణ్యతకు పెద్దపీట వేస్తారు. అక్కడ పోటులో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తుంటారు. అయితే ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా 74 మంది శ్రీ వైష్ణవులతో పాటుమరో పదిమంది ఇతరులను నియమించాలని భావిస్తున్నారు. ఇటీవల తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లో లడ్డు నాణ్యత తగ్గకూడదని భావిస్తోంది. అదే సమయంలో భక్తులు అడిగినన్ని లడ్డూలు అందించేందుకు ఏర్పాటు చేస్తోంది.
* వరుస నిర్ణయాలతో
ఇటీవల టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకం అయిన సంగతి తెలిసిందే. టీటీడీ పటిష్టతకు అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటోంది.తిరుమల కొండపై ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదని.. మీడియాతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని ఆంక్షలు విధించింది. అదే సమయంలో టిటిడి ప్రాంగణంలో సోషల్ మీడియాలో రీల్స్ చేయడం, ఫోటోలు తీయడానికి కూడా కఠినంగా నిషేధించింది. ఇప్పుడు లడ్డూల తయారీకి సంబంధించి ఏకంగా 80 మంది సిబ్బందిని నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.టిటిడి చర్యలపై భక్తుల నుంచి అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.