YCP: వైసీపీ నేతల ఆకలి.. ఒక్కరోజు టీ, కాఫీ, స్నాక్స్ ఖర్చు అక్షరాల రూ.4,12,000

ఒక్కరోజులో నాలుగు లక్షల రూపాయల విలువ చేసే టి, కాఫీ తాగేసారంటే ఈ పేద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంత ఆకలితో ఉన్నారో అర్థమవుతుంది. అయితే ముందస్తుగానే అంచనా వేసి మరి టీ, కాఫీ కోసం నిధులు కేటాయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Written By: Dharma, Updated On : June 20, 2024 5:31 pm

YCP

Follow us on

YCP: తమిళనాడులో అధికారంలోకి వచ్చిన స్టాలిన్ దుబారా ఖర్చులు తగ్గించేందుకు అనేక సంస్కరణలు చేపట్టారు. అసెంబ్లీలో క్యాంటీన్ ను మూయించారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరికి వారు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రజా ప్రతినిధులకు ఇష్టం లేకున్నా.. ప్రజల మధ్య చులకన అవుతామని భావించి ఎవరూ నోరు మెదపలేదు. కానీ తాను ఒక నిరుపేద ముఖ్యమంత్రినని.. పెత్తందారులతో పెద్దయుద్ధమే చేస్తున్నానని నిన్నటి వరకు ఏపీని పాలించిన జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఆయన అధికారం నుంచి దూరమైన నాటి నుంచి ఆయన పేద కాదు.. ధనిక సీఎం అని ఒక్కొక్క ఘటన వెలుగులోకి వస్తోంది. మొన్నటికి మొన్న రుషికొండలో కళ్ళు బైర్లు కమ్మే నిర్మాణాలు బయటకు వచ్చాయి. 500 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆ భవనాల్లో ప్రతి కట్టడం ఒక అద్భుతమే. ఆ విషయం అలానే ఉండగా.. జగన్ సర్కార్ కౌన్సిల్ సమావేశం నాడు టీ ఖర్చు అక్షరాలా రూ.4,12,000 (నాలుగు లక్షల 12 వేల రూపాయలు).

ఒక్కరోజులో నాలుగు లక్షల రూపాయల విలువ చేసే టి, కాఫీ తాగేసారంటే ఈ పేద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంత ఆకలితో ఉన్నారో అర్థమవుతుంది. అయితే ముందస్తుగానే అంచనా వేసి మరి టీ, కాఫీ కోసం నిధులు కేటాయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2021 డిసెంబర్ 10న కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆరోజు టి, కాఫీ, స్నాక్స్ ఖర్చు కోసమని రూ.4,12,000 అవసరమని ముందుగానే ఎస్టిమేషన్ తయారు చేశారు. ప్రస్తుతం ఈ ఎస్టిమేషన్కు సంబంధించి ధ్రువీకరణ పత్రం ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక్కరోజులో అంత ఎలా తాగారు రా? నీళ్లు కూడా తాగకుండా.. కాఫీ,టీలు మాత్రమే తాగారా ఏంట్రా? అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా టిడిపి శ్రేణులు ట్రోల్ చేస్తున్నారు.

ఆంధ్ర పేద రాష్ట్రం అని చెప్పుకునే జగన్ దీనికి సమాధానం చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది. సిబిఎన్ ఎగైన్ పేరిట పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. రుషికొండలో నిర్మాణాల విషయంలోనే వైసీపీ చుట్టూ పెద్ద ఎత్తున వివాదాలు నడుస్తున్నాయి. అక్కడ నిర్మాణాలు, కట్టడాలు.. ఇలా ఒకటేమిటి ప్రతి అంశము వైరల్ గా మారింది. వైసీపీ నుంచి దిద్దుబాటు చర్యలకు నేతలు దిగుతున్నా ప్రజల్లోకి బలంగా చర్చికెళ్ళింది. ఇప్పుడు టీ, కాఫీ, స్నాక్స్ అంటూ ప్రచారం ప్రారంభమైంది. వైసీపీ హయాంలో జరిగిన దుబారా ఖర్చు బయట పెట్టాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. మున్ముందు ఇలాంటి పోస్టులు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ దుబారా ఖర్చు హైలెట్ అవుతోంది.