AP Roads: రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. గోతుల్లో రహదారులను వెతుక్కోవలసిన దౌర్భాగ్య స్థితి నెలకొంది. ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టైనా లేదు. దీంతో ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల నిర్వహణను గాలికి వదిలేసింది. ఏటా అదిగో ఇదిగో అంటూ.. గడువుల మీద గడువులు పెట్టుకుంటూ వచ్చింది. సీఎం జగన్ సైతం స్వయంగా రోడ్లు వేస్తామని ప్రకటించడం పరిపాటిగా మారింది. ఈ తరుణంలో నాలుగున్నర ఏళ్ల కాలం కరిగిపోయింది. కానీ రహదారులు మాత్రం బాగుపడలేదు.
ప్రజలు ఎక్కడికక్కడే బాహటంగానే రహదారుల స్థితిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై గోతుల్లో మంచం వేసుకుని పడుకోవడం.. గోతుల్లో వరి నాట్లు వేయడం వంటి వినూత్న రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా అటువంటి ఘటనే అనకాపల్లి జిల్లాలో వెలుగు చూసింది. నర్సీపట్నం నుంచి కృష్ణదేవిపేట మార్గంలో ఓ చోట రోడ్డు మధ్యలో గొయ్యి ఏర్పడింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ గొయ్యి వద్ద తరచూ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో స్థానికులు ఓ ఆలోచన చేశారు. అది విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ గొయ్యి వద్ద ముళ్ళ కంపలు వేశారు. చెట్టు కొమ్మలు పెట్టి ” ఇది జగనన్న గొయ్యి.. చూసుకొని వెళ్ళండి జాగ్రత్త “.. అంటూ పౌర సేవా సంస్థ పేరుతో వ్యంగ్యంగా ఫ్లెక్సీ పెట్టారు. ఆ రోడ్డులో ప్రయాణించే వాహనదారులను అప్రమత్తం చేయడంతో పాటు ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా ఉన్న ఈ ఫ్లెక్సీ ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలో రహదారుల అధ్వాన్న పరిస్థితిని తెలియజేస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతుంది. నెటిజెన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా రహదారులను బాగు చేయాలని కోరుతున్నారు.