AP Government: ఏపీలో పౌర సేవలను( citizen services) సులభతరం చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇకనుంచి అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదు. భవన నిర్మాణాలు, లేఅవుట్ల( layouts ) అనుమతులకు సంబంధించిన నిబంధనలను సులభతరం చేసింది. ఈ మేరకు ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017( AP building rules), ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017లో సవరణలు చేస్తూ ప్రభుత్వం వేరువేరుగా ఉత్తర్వులు జారీచేసింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో( speed of doing business) భాగంగా భవన, లేఅవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటికే దీనిపై క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు నేరుగా ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఈ జీవోలతో పేదలకు కూడా ప్రయోజనం జరగనుంది. ప్రభుత్వం ఇచ్చే పట్టాల్లో ఇల్లు కట్టుకునే వారికి అనుమతులు సులభంగా రానున్నాయి. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఈ నిర్ణయాలు మరింత ఊతమివ్వనున్నాయి.
* ఆ నిబంధన సడలింపు
గతంలో లేఅవుట్లలో( layouts ) రోడ్డుకు 12 మీటర్ల వెడల్పు ఉండాలన్న నిబంధన ఉండేది. దానిని తొమ్మిది మీటర్లకు తగ్గించారు. 500 చదరపు మీటర్ల పైన స్థలాల్లో నిర్మాణాన్ని సెల్లారుకు అనుమతించారు. నేషనల్ హైవే తో పాటు స్టేట్ హైవే లకు ఆనుకొని ఉన్న స్థలాలు అభివృద్ధి చేసేందుకు 12 మీటర్ల సర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధనను కూడా తొలగించారు. ఇక అపార్ట్మెంట్ నిర్మాణాలకు సంబంధించి సెట్ బ్యాక్ నిబంధనల్లో కూడా మార్పులు చేసింది ప్రభుత్వం. టిడిఆర్ బాండ్ల జారీ చేసే కమిటీ నుంచి రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ లను తొలగించారు. అందరికీ అనుకూలంగా ఉండేలా నిబంధనలో మార్పులు చేసి జీవో జారీ చేసినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ( Minister Narayana) తెలిపారు. సంక్రాంతి కానుకగా ఈ జీవోలు తీసుకొచ్చినట్లు చెప్పారు.
* ఐదేళ్లుగా కుదేలు
గత ఐదేళ్ల వైసిపి పాలనలో రియల్ ఎస్టేట్ ( real estate field )రంగం కుదేలయింది. రకరకాల నిబంధనలను తెరపైకి తెచ్చిన జగన్ సర్కార్ తీరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వీటన్నింటికీ చెక్ చెప్పాలని భావించింది. అందుకే నిబంధనలను చాలా వరకు సరళతరం చేయాలని నిర్ణయించింది. క్యాబినెట్ భేటీలో సైతం ఇదే చర్చకు వచ్చింది. మంత్రివర్గం సైతం ఆమోదముద్ర వేసింది. దీంతో ప్రజలకు సంక్రాంతి కానుకగా ఈ జీవోలను విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. అయితే దీనిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
* పేదలకు ప్రయోజనం
అయితే ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులకే కాదు. పేదలకు సైతం ప్రభుత్వ జీవోతో ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం ఇచ్చే పట్టాలలో ఇల్లు కట్టుకునే వారికి సులభంగా అనుమతులు లభించునున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంత( town areas ) ప్రజలకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరం. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్ అనుమతులు తప్పనిసరి. ఆపై బ్యాంకు రుణం పొందాలంటే రకరకాల కొర్రీలు పెడుతుంటారు. కానీ తాజా జీవోతో అటువంటి ఇబ్బందులు తొలగిపోయినట్టే.