Amaravati Capital : ఏపీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత వేగంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది.కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు ప్రారంభమయ్యాయి.జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు.రెండు రాష్ట్రాల ఐఐటి నిపుణులు రాజధాని నిర్మాణాలను పరిశీలించారు. యధా స్థానంలోకి తెచ్చి వాటిని పునః ప్రారంభించుకోవచ్చని నివేదికలు ఇచ్చారు. దీంతో సీఎం చంద్రబాబు సిఆర్డిఏ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే ఈసారి గతానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తోంది. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రపంచ బ్యాంకు నిధులనుంచి సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిధులు అందించేందుకు ప్రపంచ బ్యాంకు సైతం ఆసక్తిగా ఉంది. అదే సమయంలో అమరావతికి భారీ ప్రాజెక్టులను మంజూరు చేస్తుంది కేంద్రం. ఎప్పటికీ కొత్త రైల్వే లైన్లను మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఐకాన్ బ్రిడ్జ్ వంటి ప్రాజెక్టులు క్రమంగా రూపు దాల్చుకుంటున్నాయి. మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ కూడా సిద్ధమైంది. అమరావతి పరిధిలో దశలవారీగా మెట్రో రైలు పట్టాలెక్కబోతోంది.
* ఈఎస్ఐ ఆసుపత్రి తో పాటు మెడికల్ కాలేజ్
అయితే తాజాగా అమరావతికి కేంద్రం మరో వరం ప్రకటించింది. అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. 500 పడకల సామర్థ్యం గల ఆసుపత్రి ఇది. అలాగే సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ పడకల సామర్థ్యం కూడా 150. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో ఈఎస్ఐ ఆసుపత్రి ఉండేది. రాష్ట్ర విభజనతో అది తెలంగాణ వాటా కిందకు వెళ్ళింది. దీంతో ఏపీకి ఈఎస్ఐ ఆసుపత్రిని మంజూరు చేయాలని గతంలోనే చంద్రబాబు కోరారు. దీనిపై తాజాగా సానుకూలంగా స్పందించింది కేంద్ర ప్రభుత్వం. అందుకు సంబంధించి భూములను సైతం కేటాయించేందుకు చంద్రబాబు సర్కార్ సుముఖంగా ఉంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఈఎస్ఐ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలంటే 25 ఎకరాలు అవసరమవుతాయి. 500 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలంటే 10 ఎకరాల భూమి అవసరం. కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉండడంతో.. కేంద్రం మంజూరు చేసేందుకు ముందుకు రావడం ఖాయం.
* కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు
ప్రస్తుతం అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గత ఐదేళ్లలో వివిధ కారణాలతో చాలా కంపెనీలు అమరావతి నుంచి బయటకు వెళ్లిపోయాయి. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఒక్కో కంపెనీ ఇప్పుడు మళ్లీ అమరావతికి వస్తోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కూడా అమరావతికి క్యూ కొడుతున్నాయి. ఇది నిజంగా శుభ పరిణామమే. తాజాగా ఈఎస్ఐ ఆసుపత్రి తో పాటు మెడికల్ కాలేజీ అమరావతిలో ఏర్పాటు చేస్తే లక్షలాదిమంది కార్మికులతో పాటు వైద్యవృత్తిలో అడుగు పెట్టాలనుకుంటున్న యువతకు మంచి అవకాశం దొరికినట్టే. అయితే తాజాగా అమరావతికి కేటాయించిన ఈ రెండింటిని కేంద్రమే నిర్మించితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తప్పినట్లు అవుతుంది.