Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : గరికిపాటి విషయంలో పవన్ అభ్యంతరం.. అందుకే చాగంటికి!

Pawan Kalyan : గరికిపాటి విషయంలో పవన్ అభ్యంతరం.. అందుకే చాగంటికి!

Pawan Kalyan :  ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను ప్రకటించింది. నిన్ననే రెండో జాబితాను ప్రకటించింది. దీనికోసమే కూటమి పార్టీల నేతలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో రెండో జాబితాను ప్రకటించింది ఏపీ సర్కార్. అయితే జాబితాలో రెండో పేరును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. క్యాబినెట్ హోదా తో కూడిన పదవి అది. విద్యార్థులకు నైతిక విలువలు పెంపొందించే ప్రభుత్వ సలహాదారుగా ఆయనను నియమించారు. అయితే సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే చాగంటి ఇలాంటి వ్యక్తులకు పదవి ఇవ్వడం ద్వారా మంచి సందేశం ఇచ్చినట్లు అయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే గతంలోనూ టిడిపి ప్రభుత్వం ఆయనకు పదవి ప్రకటించింది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో చాగంటికి ఈ బాధ్యతలు తీసుకోవాలని కోరింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తాను కానీ.. తనకు ఏ పదవులు వద్దు అని అప్పట్లో చాగంటి తిరస్కరించారు. ప్రభుత్వానికి సవినయంగా తెలియజేశారు.తనకు పదవులు పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని చెప్పారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఆయన అనుమతి లేకుండా ఈ పదవి ప్రకటించి ఉండరని.. ఆయన అభిప్రాయం తెలుసుకున్న తరువాతే ప్రకటించి ఉంటారని తెలుస్తోంది.

* ఉపాధ్యాయ వృత్తి నుంచి..
అయితే చాగంటి కోటేశ్వరరావు కాకుండా మరో ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావుకు పదవి ఇస్తారని ప్రచారం సాగింది. ఈ ఇద్దరు సమకాలీకులే. సమాజంపై విపరీతమైన ప్రభావం చూపే వారే. అయితే గరికపాటి నరసింహారావు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ పదవి ఇవ్వడం సముచితం. పైగా ఇదే పదవిని చాగంటి కోటేశ్వరరావు గతంలో తిరస్కరించారు. ఈ కారణం చేత గరికపాటిని ప్రభుత్వం ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆయన పేరును ఈ జాబితాలో చేర్చినట్లు కూడా సమాచారం. అయితే చివరి నిమిషంలో గరికిపాటి పేరును తొలగించి చాగంటి పేరు పెట్టినట్లు తెగ ప్రచారం నడుస్తోంది. దానికి రాజకీయ కారణాలు ఉన్నట్లు వైసిపి అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది.

* ఆ వివాదమే కారణం
గతంలో ఒకసారి చిరంజీవి విషయంలో గరికపాటి వ్యవహరించిన తీరు తెలిసిందే. ఒక కార్యక్రమంలో గరికపాటి ప్రవచనం చేస్తుంటే.. అదే కార్యక్రమానికి హాజరైన చిరంజీవి చుట్టూ అభిమానులు చేరి సెల్ఫీలకు దిగారు. దీంతో గరికపాటి ప్రవచనానికి ఇబ్బంది కలిగింది. ఈ తరుణంలో చిరంజీవిని ఉద్దేశించి గరికపాటి చేసిన కామెంట్స్ మెగా అభిమానుల్లో ఆగ్రహాన్ని నింపాయి. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు నాగబాబు. కొద్ది రోజులపాటు గరికపాటిని ఓ రేంజ్ లో వేసుకున్నారు మెగా అభిమానులు. ఇప్పుడు అదే గరికపాటికి కూటమి ప్రభుత్వంలో పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తారని.. అందుకే చంద్రబాబు మళ్లీ చాగంటి కోటేశ్వరరావుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపైనే వైసీపీ అనుకూల మీడియా కథనాలు వడ్డిస్తోంది. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version