Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు( Visakha steel plant ) మంచి రోజులు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రైవేటీకరణ అంశం ఆందోళన కలిగిస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారీ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రివర్గం దీనికి సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే ఇందుకు సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇది ఫలప్రదంగా పూర్తయిన తర్వాత దీనిపై స్పష్టమైన ప్రకటన చేయనుంది కేంద్రం. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కంటే ప్లాంట్ ఆర్థిక సాయం అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్లాంటుకు రూ 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ సమకూర్చాలని నిర్ణయించినట్లు ప్రచారం నడుస్తోంది.
* ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో
ప్రధాని నరేంద్ర మోదీ( Prime Minister Modi) ఆధ్వర్యంలో నిన్న క్యాబినెట్ భేటీ అయింది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దీనిపై శుక్రవారం సంయుక్తంగా ప్రకటన వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి నరేంద్ర మోడీతో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇటీవల విశాఖలో ప్రధాని మోదీ పర్యటించారు. ఆ సందర్భంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించి ఆర్థిక సాయం అందించాలని కోరారు కూడా. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆర్థిక ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం.
* వైసిపి హయాంలో
వైసిపి( YSR Congress ) ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. నష్టాలతో పాటు రకరకాల సాకులు చూపి ప్రైవేటీకరణకు మొగ్గుచూపింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరిస్తామని పార్లమెంట్ లోనే చెప్పుకొచ్చింది. దీంతో పెద్ద ఎత్తున ఉద్యమం ఎగసి పడింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఏర్పాటైన.. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామంటూ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టారు. బిజెపి తప్పించి అన్ని రాజకీయ పక్షాలు అప్పట్లో మద్దతు తెలిపాయి. అయితే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలమైందని చంద్రబాబుతో పాటు పవన్ తప్పుపట్టారు. జగన్ చర్యలతోనే విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం అవుతోందని ఎన్నికల్లో ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు.
* ఎట్టకేలకు స్పష్టత
అయితే అధికారంలోకి వచ్చినా.. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం( central government) స్పష్టత ఇవ్వలేదు. మొన్న విశాఖ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై స్పష్టతనిస్తారని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. కనీస స్థాయిలో కూడా ప్రకటన రాలేదు. దీంతో విపక్షాలు కూటమి ప్రభుత్వంపై దాడి ప్రారంభించాయి. అయితే తాజాగా క్యాబినెట్ కమిటీలో 11,500 కోట్ల రూపాయలు అందించాలని తీర్మానించడం విశేషం. ఈరోజు సాయంత్రానికి కేంద్ర మంత్రులు హెచ్డి కుమారస్వామి, కింజరాపు రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోవడంతో పాటు మంచి రోజులు వచ్చినట్టే.