TDP Party : తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా కోటి సభ్యత్వాలను నమోదు చేసుకుంది. గత కొంతకాలంగా ఈ సభ్యత్వ నమోదు జరుగుతోంది. ఈసారి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నమోదు ప్రక్రియ చేపట్టారు. సభ్యత్వంతో పాటు ప్రమాద బీమాను కూడా కల్పించడంతో చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు చేసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 26 నుంచి ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ప్రారంభంలో మందకొడిగా సాగింది. కానీ క్రమేపి సభ్యత్వ నమోదు ప్రక్రియ పెరుగుతూ వచ్చింది. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ఉత్సాహంగా సాగింది. వాస్తవానికి ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ డిసెంబర్ 31 తో ముగిసింది. కానీ సంక్రాంతి వరకు అవకాశం ఇవ్వాలని పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన విన్నపాన్ని చంద్రబాబు మన్నించారు. సభ్యత్వ నమోదు గడువును పెంచారు. మొత్తం కోటి 52 వేల 598 సభ్యత్వాలు నమోదయ్యాయి.
* సరికొత్త టెక్నాలజీతో
తెలుగుదేశం పార్టీకి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్లో ( Andaman Nicobar)బలమైన కేడర్ ఉంది. ఈ మూడు చోట్ల సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించింది టిడిపి. 11 నియోజకవర్గాల్లో అయితే లక్షకు పైగా సభ్యత్వ నమోదులు జరిగాయి. ఈ క్రమంలో కోటి మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ అతిపెద్ద కుటుంబంగా అవతరించింది. టెక్నాలజీ అనుసంధానంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం సులభమైంది. ప్రజలు స్వయంగా సభ్యత్వ నమోదు చేసుకునే సౌలభ్యం ఈసారి కల్పించారు. వారు ఎక్కువగా వినియోగించే ప్లాట్ఫామ్స్ తో సభ్యత్వ నమోదు జరిగింది. అయితే నారా లోకేష్ ఆలోచనకు తగ్గట్టుగా జరిగిన సభ్యత్వ నమోదు సక్సెస్ అయ్యింది.
* టాప్ టెన్ లో నియోజకవర్గాలు
సభ్యత్వ నమోదులో( membership ) టిడిపి నాయకులు పోటా పోటీగా పనిచేశారు. సరికొత్త రికార్డును సృష్టించారు. నెల్లూరు సిటీలో 1,49,270 సభ్యత్వాలు నమోదు అయ్యాయి. ఆత్మకూరులో 1,48 802, పాలకొల్లులో 1,48,559, రాజంపేటలో 1,45,766, కుప్పంలో 1,38,446, ఉండిలో 1,21,527, గురజాలలో 1,11,458, వినుకొండలో 1,06,8 67, మంగళగిరిలో 1,06,145, కళ్యాణదుర్గంలో 1,01,221, కోవూరులో 1,00,473 సభ్యత్వాలు నమోదయ్యాయి.
* నారా లోకేష్ పర్యవేక్షణలో
అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నారా లోకేష్( Nara Lokesh) పర్యవేక్షించారు. ఆయన ఏకంగా కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. కార్యకర్తలు వారి కుటుంబ సభ్యుల విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలను ఆదుకుంటూ కొన్నంత అండగా నిలుస్తున్నారు. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబానికి ప్రమాద బీమా అందించి ధీమా కల్పిస్తున్నారు. 100 రూపాయలతో సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం చూసేందుకు లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి వెల్ఫేర్ వింగ్ అవిశ్రాంతంగా పనిచేస్తోంది. సభ్యత్వ నమోదు తో ఐదు లక్షల ప్రమాద బీమాను కూడా అందిస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకుగాను టిడిపి 45 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించింది. అయితే టిడిపి చరిత్రలోనే కోటి సభ్యత్వాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది.