https://oktelugu.com/

TDP And Janasena: కూటమిలో ఎమ్మెల్సీల సందడి.. బరిలో వీళ్లు.. ఈసారికి ఛాన్స్ వారికే

ఏపీలో ఇప్పుడు కూటమి హవా నడుస్తోంది. వైసీపీ లెక్కలో లేదు. దీంతో ఏ పదవి వచ్చినా మూడు పార్టీలు సర్దుకోవాల్సిందే. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

Written By:
  • Dharma
  • , Updated On : December 19, 2024 / 03:57 PM IST

    TDP And Janasena

    Follow us on

    TDP And Janasena: ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీల సందడి ప్రారంభమైంది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వచ్చే ఐదేళ్ల పాటు ఎమ్మెల్సీ కానీ.. రాజ్యసభ పదవి కానీ ఆ పార్టీకి దక్కే అవకాశం కనిపించడం లేదు. దీంతో కూటమి ఏకపక్షంగా వాటిని దక్కించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు రాజ్యసభ పదవులకు సంబంధించి కూటమి కైవసం చేసుకుంది. ఇప్పుడు అందరి దృష్టి ఎమ్మెల్సీలపై పడింది. వైసీపీకి చెందిన కర్రీ పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయ మంగళం వెంకటరమణ రాజీనామా చేశారు. వీటికి సంబంధించి మండలి చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. అయితే వీటితో పాటు మార్చిలో మరికొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఒకేసారి 13 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమైంది. వీటి భర్తీ పై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పదవుల సర్దుబాటుపై దృష్టి సారించారు. ఈ 13 పదవుల విషయంలో అనేక సమీకరణలు తెరపైకి రానున్నాయి. మూడు పార్టీల మధ్య పొత్తు ఉన్న తరుణంలో.. ఎమ్మెల్సీ పదవుల పంపకం కత్తి మీద సాముగా మారనుంది.

    * ఆ ఇద్దరికీ పక్కా
    అయితే వైసీపీ నుంచి టిడిపిలో చేరారు మోపిదేవి వెంకటరమణ. రాజ్యసభ పదవి సైతం వదులుకున్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవి ఆశిస్తుండడంతో తొలి జాబితాలోనే ఆయన పేరు ఖరారు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకో నున్నారు. ఆయనకు సైతం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే మండలిలో జనసేన బలం రెండుకు చేరనుంది. మరోవైపు బిజెపికి సైతం ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తారని టిడిపి ముఖ్యులు చెబుతున్నారు.

    * ఆశావాహులు అధికం
    ప్రధానంగా ఎమ్మెల్సీ పదవుల ఆశావహులు టిడిపిలోనే అధికంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సీట్లు త్యాగం చేసిన నేతలు, సీనియర్లు పదవులు ఆశిస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రులు దేవినేని ఉమా, జవహర్, వంగవీటి రాధాకృష్ణ, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పే స్వామి, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్, బీద రవిచంద్ర, టీడీ జనార్ధన్, బుద్ధ వెంకన్న, సుగుణమ్మ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే జనసేనతో పాటు బిజెపికి సర్దుబాటు చేయాల్సి ఉండడంతో.. ఎమ్మెల్సీల పదవుల ఎంపిక అంత ఆషామాషీ కాదు.