AP BJP Chief: ఏపీ బీజేపీ చీఫ్( AP BJP Chief ) ఖరారయ్యారు. ఈ మేరకు బిజెపి అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. సామాజిక ప్రాంతీయ సమీకరణలకు పెద్దపీట వేస్తూ.. ఈసారి రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే కూటమి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆ రెండు పార్టీలను సమన్వయం చేసుకునే నేతకు బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా జగన్ సొంత జిల్లా నుంచి పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో కూటమి కట్టిన బిజెపి ఏపీలో ఖాతా తెరిచింది. 8 అసెంబ్లీ సీట్లతో పాటు మూడు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. ఒకవైపు ఆ రెండు పార్టీలతో పొత్తు దిశగా ముందుకు వెళ్తూనే.. సొంతంగా కూడా పార్టీ ఎదగాలని భావిస్తోంది. ఇందుకుగాను ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి స్థానంలో కొత్త అధ్యక్షుడు నియామకంపై పార్టీ ముమ్మర కసరత్తు చేస్తోంది. అయితే కడప జిల్లాకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే పార్టీ అధ్యక్ష పదవి కోసం చాలామంది నేతలు పావులు కదిపారు. అయితే సామాన్య కార్యకర్త నుంచి కష్టపడి పని చేసిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకమాండ్ భావించింది. అందులో భాగంగానే రామచంద్రారెడ్డి పేరును పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.
* సుదీర్ఘకాలంగా బిజెపిలో
సింగిరెడ్డి రామచంద్రారెడ్డి( singareddy Ramachandra Reddy) బిజెపిలో చాలా కాలంగా పనిచేస్తూ వచ్చారు. కడప జిల్లా పులివెందుల ఆయన సొంత నియోజకవర్గం. పులివెందుల సమీపంలోని వేంపల్లి ఆయన స్వస్థలం. 1978 నుంచి ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నారు. కాలేజీ అధ్యక్షుడిగాను పనిచేశారు. 2017 లో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. కిసాన్ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన- ప్రచార కమిటీకి ఏపీ కన్వీనర్ గా కూడా రామచంద్రారెడ్డి వ్యవహరించారు. రైతాంగ సమస్యలపై పోరాటం చేయడంలో ముందుంటారు.
* విస్తృత సేవా కార్యక్రమాలు
కడప జిల్లాలో( Kadapa district) సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా ముందు వరుసలో ఉండేవారు రామచంద్రారెడ్డి. రైతు సేవా సమితి ఏర్పాటు చేసి సాగునీటి సమస్యలకు పరిష్కార మార్గం చూపేవారు. కడప రిమ్స్ కు మూడేళ్ల పాటు మినరల్ వాటర్ ఉచితంగా సరఫరా చేశారు. పసుపు రైతులకు మద్దతు ధర కోసం దీక్షలు కూడా చేశారు. ఇవన్నీంటిని పరిగణలోకి తీసుకున్న బిజెపి హై కమాండ్ రామచంద్రారెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చాలామంది నేతలు ఆశావహులుగా ఉన్నా.. చివరకు రామచంద్రారెడ్డి వైపు బీజేపీ హై కమాండ్ మొగ్గు చూపడం విశేషం.
* చాలామంది ఆశావహులు
ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి( purandeshwari) పదవీకాలం జూలై వరకు ఉంది. దీంతో కొత్త అధ్యక్ష నియామకం అనివార్యంగా మారింది. తొలుత ఈ పదవి సుజనా చౌదరికి వివరిస్తుందని అంతా భావించారు. మరోవైపు రాయలసీమకు చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపించింది. విష్ణువర్ధన్ రెడ్డి తో పాటు ఉత్తరాంధ్రకు చెందిన పివిఎన్ మాధవ్, పూడి తిరుపతిరావు వంటి వారు ఆశావహులుగా ఉన్నా.. చివరకు హై కమాండ్ రామచంద్రారెడ్డి వైపు మొగ్గు చూపడం విశేషం.