New Liquor Policy in AP :ఏపీలో కొత్త మద్యం పాలసీపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఈనెల 18న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో మద్యం విధానాలు, మార్గదర్శకాలపై చర్చించనున్నారు.ఇప్పటికే మద్యం పాలసీపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు.వారు చేసిన అధ్యయనం మేరకు తమ సిఫారసులను క్యాబినెట్ కు సమర్పించనున్నారు. మద్యం దుకాణాలతో పాటు బార్లను గతం మాదిరిగానే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈనెల 19న నోటిఫికేషన్ జారీచేయనున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తక్కువ ధరలకే మద్యం అందిస్తామని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు కొత్త మద్యం పాలసీని ప్రకటించనున్నారు.ఈనెల 18న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ తర్వాత రోజున నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
* ప్రభుత్వ దుకాణాలు రద్దు
వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నిర్వహించింది. వాస్తవానికి తాను అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తానని జగన్ 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు.కానీ అమలు చేయలేకపోయారు.పైగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపించింది.గతంలో ఎన్నడు కనిపించని కొత్త బ్రాండ్లను విక్రయించింది. మందుబాబులకు షాక్ కొట్టేలా అధిక ధరలకు అమ్మకాలు చేసింది. దీంతో ఇది ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది.పైగాకొత్త బ్రాండ్లకు మద్యంతో ప్రజారోగ్యానికి తీవ్ర భంగం వాటిల్లిందని విపక్షాలు అప్పట్లో ఆరోపించాయి.అయినా సరే బ్రాండ్ల విషయంలో జగన్ సర్కారు వెనక్కి తగ్గలేదు.
* కూటమి హామీకి ఫిదా
ఈ ఎన్నికల్లో మద్యం పై హామీ కూటమికి వర్కౌట్ అయింది. తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరలకు.. గతం మాదిరిగా బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. మందుబాబులు సైతం ఖుషి అయ్యారు. వారిలో ఎక్కువ శాతం మంది టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపారు.అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు మద్యం పాలసీని మారుస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.పాత బ్రాండ్లను.. పాత ధరలకే అందించాలని నిర్ణయించింది. దీంతో ధరలపై రకరకాల ప్రచారం నడుస్తోంది. వంద రూపాయలకే బీరుతో పాటు క్వార్టర్ మద్యం అందించనున్నట్లు టాక్ నడుస్తోంది.
* టెండర్ల ప్రక్రియతోనే
తిరిగి టెండర్ల ప్రక్రియ ద్వారా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది. ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ ఆరు రాష్ట్రాల్లో మద్యం విధానం పై అధ్యయనం చేసింది. ఈనెల 18న క్యాబినెట్ సమావేశం జరుగుతుండడంతో తమ నివేదికలను అందించునుంది. అదే సమయంలో బార్లు, ధరలకు ఫీజులపైన తుది కసరత్తు జరుగుతోంది. బార్లు, మద్యం దుకాణాలకు ఎంత దూరం ఉండాలి? ఎలాంటి నిబంధనలు అమలు చేయాలి? మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో ఈ నెల 17న క్యాబినెట్ సబ్ కమిటీమద్యం పాలసీపై తుది ముసాయిదాను సిద్ధం చేయనుంది.