ఇప్పటికే దేశవ్యాప్తంగా నిత్యవసరాల ధరలు మండిపోతున్నాయి. ఓ వైపు కరోనా సంక్షోభం మరో వైపు ఆర్థిక ఇబ్బందులకు తోడు నిత్యవసరాల ధరలు పెరగడంతో ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై మరో భారాన్ని మోపడానికి సిద్ధమవుతోంది. బహిరంగ మార్కెట్‌లో ఇప్పటికే ధరలు దడపుట్టించేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ నేతృత్వంలోని చౌకధర దుకాణాల్లో తక్కువ ధరకు లభించే కొన్ని వస్తువులైన ప్రజలకు అండగా ఉన్నాయి.
కానీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రేషన్ షాపుల్లో లభించే వస్తువుల ధరలను సైతం పెంచడానికి నిర్ణయించుకుంది. ఇప్పటికే చెక్కెర ధరను పెంచిన ప్రభుత్వం ఇతర వస్తువుల ధరలను సైతం పెంచడానికి నిర్ణయం తీసుకుంది. చౌక ధర దుకాణాల్లో లభించే వస్తువుల ధరలు బయటి మార్కెట్‌లో ఉన్న ధరలో కేవలం 25 శాతం మాత్రమే ఇకపై సబ్సిడీ ఇవ్వాలనుకుంటోంది. ఈ ధరల పెంపు నిర్ణయం డిసెంబర్ నుంచి అమల్లోకి రానున్నదని సమాచారం.
ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ప్రభుత్వం అందిస్తున్న చెక్కెర (పంచదార) కిలోపై రూ.14 ఇదివరకే జగన్ సర్కారు పెంచింది. తాజాగా కందిపప్పుపై రూ.27 పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే రేషన్ డీలర్ల నుంచి డీడీలు కూడా స్వీకరిస్తోంది. అంటే ప్రస్తుతం కిలో కందిపప్పు 40 రూపాయలకు లభిస్తుండగా.. అది రూ.67కు పెరగనున్నది. ఇక పెంచిన పంచదార ధరను గమనిస్తే.. కీలోకు బహిరంగా మార్కెట్‌లో రూ. 20 ఉండగా.. రేషన్ షాపులో రూ.17కు ఇస్తున్నారు. ప్రభుత్వం తీసకున్న తాజా ధరల పెంపు నిర్ణయం కారణంగా ప్రజలపై భారీగానే భారం పడనున్నది.
రేషన్ షాపులో అందించే సరుకుల పెంపువల్ల కందిపప్పుపై నెలకు రూ. 40 కోట్ల భారం ప్రజలపై పడనుంది. అలాగే, పంచదారపై దాదాపు రూ.10 కోట్ల భారం పడుతోంది. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభ కాలంలో జగన్ సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలోస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తగదని ప్రతిపక్షాలతో పాటు సామాన్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవలనీ, 50 శాతం రాయితీతో రేషన్ షాపు సరుకులను ప్రజలకు అందించాలని ప్రతిపక్ష టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఉచితంగా సరుకులు అందిస్తున్న సమయంలోనూ పంచదారను ఫ్రీగా ఇవ్వకుండా జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి.