
ఈ మధ్య కాలంలో సైబర్ మోసగాళ్లు అమాయక ప్రజలను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రజలు ఎక్కువగా వినియోగించే వాట్సాప్ యాప్ ను టార్గెట్ చేసి మోసాలు చేస్తున్నారు. తాజాగా ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే వ్యక్తికి స్నేహితుని పేరుతో గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో తన ఫోన్ నంబర్ పని చేయడం లేదని మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీ చెబితే వాట్సాప్ ఖాతాను వేరే మొబైల్ లో ఉపయోగించవచ్చని ఉంటుంది.
ఆ ఓటీపీని పొరపాటున చెప్పారంటే మాత్రం మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవడం గ్యారంటీ. పాత ఫోన్ నుంచి వాట్సాప్ ను కొత్త ఫోన్ లోకి మార్చుకోవాలని అలా చేయాలంటే ఓటీపీ ఇవ్వాలని తెలిసిన వాళ్ల పేర్లతో వాట్సాప్ కు సందేశాలు పంపిస్తూ కొందరు మోసగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. తెలిసిన వ్యక్తుల పేర్లతో వాట్సాప్ కు మెసేజ్ వస్తే ఓటీపీలు చెప్పవద్దని అలా చేస్తే మోసపోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ వాళ్లు మీ వాట్సాప్ ఓటీపీని తీసుకుంటే మీ మొబైల్ లోని వాట్సాప్ లాగ్ ఔట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ తరువాత మోసగాళ్లు మన వాట్సాప్ ఖాతాలోని కాంటాక్ట్ ల సహాయంతో ఇతరులను కూడా అదే విధంగా మోసం చేస్తారు. వాట్సాప్ యాప్ వినియోగించేవాళ్లు మన ఫోన్ నంబర్ కు మనం మన నంబర్ ను ఎంటర్ చేస్తే మాత్రమే ఓటీపీ వస్తుందనే విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.,
తెలిసిన వ్యక్తుల నుంచి మెసేజ్ వస్తే అది నిజమో కాదో మొదట నిర్ధారించుకోవాలి. వాట్సాప్ యాప్ కు ఎల్లవేళలా టూ స్టెప్ వెరిఫికేషన్ ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఒక్కసారి మోసపోయామంటే భవిష్యత్తులో ఖచ్చితంగా బాధ పడాల్సి వస్తుంది.