AP Employees: ఉద్యోగ సంఘాల నాయకుల పోరాటం ఎవరికోసం?

గత నాలుగున్నర సంవత్సరాలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల నెత్తిన జగన్ టోపీ పెట్టారు. ఖర్చులు,ద్రవ్యోల్బణం రెట్టింపు అయిన ఒక్కడిఏ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన పిఆర్సి ని సైతం తగ్గించారు.

Written By: Dharma, Updated On : February 23, 2024 10:47 am

AP Employees

Follow us on

AP Employees: ప్రభుత్వ బాధిత వర్గాలు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తే.. మేమున్నామంటూ ముందుకొచ్చే వారిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉంటారు. కొత్త ప్రయోజనాల మాట పక్కన పెడితే.. ఉన్న జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం దారుణం. ఇది తమ ప్రభుత్వం అంటూ ఏరి కోరి జగన్ ను ఎన్నుకున్నారు. దగ్గరుండి గెలిపించారు. తొలినాళ్లలో మా రాజ్యం వచ్చిందంటూ ఆనందంలో మునిగితేలారు. కానీ ప్రభుత్వ కాలం కరుగుతున్న కొలదీ.. వారి ఆశలు సైతం నీరుగారిపోయాయి.పోరాటం చేయాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలకు నెల రోజుల వ్యవధి ఉందనగా పోరాట బాట పడుతున్నారు. ఈ పోరాటానికి విరుగుడుగా జగన్ సర్కార్ మరిన్ని హామీలు ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. తద్వారా మరోసారి తమనే గెలిపిస్తారని జగన్ సర్కార్ భావిస్తోంది.

గత నాలుగున్నర సంవత్సరాలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల నెత్తిన జగన్ టోపీ పెట్టారు. ఖర్చులు,ద్రవ్యోల్బణం రెట్టింపు అయిన ఒక్కడిఏ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన పిఆర్సి ని సైతం తగ్గించారు. లేనిపోని లెక్కలు చెప్పి జీతంలో సైతం కోతలు విధించారు. పోనీ జీతమైనా సక్రమంగా ఇస్తున్నారా? అది కూడా లేదు. జీతం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియడం లేదు. ఒక్కోసారి మూడో వారం దాటుతోంది. పెన్షనర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఉద్యోగుల నుంచి కత్తిరించుకున్న సొమ్ము అక్షరాల 21 వేల కోట్లు. ఇవ్వమంటే కుంటి సాకులు చూపుతున్నారు. పదవీ విరమణ చేస్తే చెల్లింపులు చేయాల్సి వస్తుందని ఏకంగా రిటైర్మెంట్ వయసును పెంచేశారు.

సాధారణంగా ఎన్నికల ముంగిట ఉద్యోగుల గొంతెమ్మ కోరికలు తీర్చడం పరిపాటిగా వస్తోంది. కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తారనగా.. ఇప్పుడు కొత్తగా చర్చలు అంటూ హడావిడి చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు సరికొత్త డ్రామా ప్రారంభించారు. వారిలో చిత్తశుద్ధి ఉంటే ఆరు నెలల కిందటే రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసేవారు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ 10 రోజుల్లో ప్రకటిస్తారనగా పోరాటానికి దిగడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వం పై కూడా ఇంత బేలతనంగా ఉద్యోగులు వ్యవహరించలేదు. తమ హక్కుల సాధన కోసం గట్టిగా పోరాడేవారు. పోరాడి సాధించుకునేవారు. కానీ జగన్ మాత్రం ఈ పోరాటానికి ముందుండి నడిపించాల్సిన నాయకులను తన గుత్తాధిపత్యం లోకి తెచ్చుకున్నారు. దాని ఫలితమే ఉద్యోగ పోరాటాల్లో చీలికలు, పేలికలు.