Free Bus In AP: మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు అయ్యింది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చైర్మన్ గా,మహిళా మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, వంగలపూడి అనితలు సభ్యులుగా ఏర్పాటైన ఈ కమిటీ ఉచిత ప్రయాణం పై అధ్యయనం చేస్తోంది.ఇప్పటికే ప్రాథమిక అంచనాలను సైతం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ పథకం అమలు అవుతున్న కర్ణాటక,తెలంగాణలో ఉచిత ప్రయాణం పై అధ్యయనం చేసింది ఈ కమిటీ. ఒక నివేదిక తయారు చేసి వీరు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు.అయితే ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని అంచనాలను రూపొందించినట్లు తెలుస్తోంది.ఈ పథకానికి సంబంధించి కీలక అంశాలు కూడా ఉన్నాయి. ప్రయాణించే వారితో పాటు అదనంగా బస్సులు, సిబ్బంది నియామకం సైతం పూర్తి చేయాల్సి ఉంటుంది.
* ఆ రెండు రాష్ట్రాల్లో
తొలుత కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం పై కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.దీంతో అక్కడి మహిళలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు.తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ ఇదే హామీ ఇచ్చింది.అధికారంలోకి రాగలిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలవుతోంది. అయితే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాల రవాణా వ్యవస్థ పై భారం పడింది. ఏపీలో కూడా పెను భారం తప్పదని తెలుస్తోంది.ఈ పథకం అమలు చేస్తే రోజుకు సగటున పది లక్షల మంది మహిళా ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.ఈ పథకం అమలు చేయడానికి అదనంగా మరో రెండు వేల బస్సులు అవసరం అవుతాయని..11వేలమంది సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు.వాస్తవానికి రోజుకు సగటున ఆర్టీసీ బస్సుల్లో 27 లక్షల మంది ప్రయాణిస్తుంటారని అంచనాలు ఉన్నాయి. అందులో పది లక్షల మంది వరకు మహిళలే ఉంటారని మంత్రుల సబ్ కమిటీ గుర్తించినట్లు సమాచారం.
* ఆక్యుపెన్సి పెరుగుదల
రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సి 68 నుంచి 69 శాతం వరకు ఉంది. ఈ పథకం అమలు చేస్తే 95 శాతానికి పెరుగుతుంది.అదే జరిగితే అదనంగా బస్సులు వేయాల్సి ఉంటుంది.ప్రస్తుతం సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్,ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు, పల్లె వెలుగు వంటి ఐదు రకాల సర్వీసులు నడుస్తున్నాయి.మహిళా ప్రయాణికుల పెరుగుతున్న దృష్ట్యా.. ఈ ఐదు రకాల సర్వీసులకు సంబంధించి రెండు వేల బస్సులు అవసరం.ఈ బస్సులకు సంబంధించి ఐదువేల మంది డ్రైవర్లు, 5000 మంది కండక్టర్లు, 1500 మంది మెకానిక్లను నియమించాల్సి ఉంటుంది.అంటే 11,500 మందిసిబ్బంది అవసరం అన్నమాట.మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆర్టీసీకి నెలకు 200 కోట్ల రూపాయలు ఆదాయం పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకుఉచిత ప్రయాణం విషయంలో ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేస్తుందో చూడాలి.