Arunachala Karthika Deepam 2025: అరుణాచలం.. ఐదారేళ్లుగా తెలుగు భక్తులు ఈ క్షేత్రానికి క్యూ కడుతున్నారు. అరుణాచల గిరిప్రదక్షిణ చేస్తే అనుకున్నది అవుతుందని, కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. నిత్యం గిరి ప్రదక్షిణ ఉన్నా.. పౌర్ణమి రోజు దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. తాజాగా తమిళ పంచాంగం ప్రకారం.. కార్తిక మాసం జరుగుతుంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా తిరువణ్ణామలై అరుణాచల క్షేత్రంలో మహాదీపం వెలిగించారు. ఆలయ అర్చకులు 3600 కిలోల నెయ్యి, 700 కిలోల వత్తులతో పర్వత శిఖరంపై భారీ జ్వాలను ^వెలిగించారు. ఈ దీపాన్ని చూసిన భక్తులు అరుణాచలేశ్వరుడిని జ్యోతి స్వరూపంగా భావిస్తూ.. స్వామిని స్మరిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు.
భక్తులతో కిటకిటలాడుతున్న అరుణాచల క్షేత్రం..
భారీ భక్తరాశులు గిరి ప్రదక్షిణ పూర్తి చేసి మహాదీపాన్ని దర్శించుకున్నారు. పర్వతారోహణలో భక్తి ఉత్సాహం, దీపారాధనలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా భక్తులు ఆకర్షితులయ్యారు.
అరుణాచలేశ్వరుడు జ్యోతి స్వరూపంగా దర్శనమిచ్చిన ఈ ఘట్టం శైవ సిద్ధాంతంలో ముఖ్యమైనది. కార్తిక మాసంలో దీపారాధన పాప విమోచనానికి, మోక్షానికి మార్గమని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవం తమిళనాడు ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో మైలురాయిగా నిలుస్తోంది.