Araku Valley: ఏపీ ఊటీ అరకు. చలికాలంలో చాలా బాగుంటుంది ఈ ప్రాంతం. మన్యంలో ప్రతిదీ చూడదగ్గ ప్రదేశమే. అందుకే పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిస్సా, చత్తీస్గడ్ నుంచి సైతం పర్యాటకులు వస్తుంటారు. అయితే విశాఖ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో అరకు చేరుకోవచ్చు. ప్రత్యేక రైల్వే సర్వీసులను సైతం నడుపుతున్నారు.తాజాగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖ నుంచి అరకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు.ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ స్పెషల్ రైలు నడుపుతున్నట్లు వాల్తేర్ సీనియర్ డిసిఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28 నుంచి జనవరి 19 వరకు ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.అయితే ప్రతి శని,ఆదివారం మాత్రమే ఈ రైలు నడుస్తుంది.అయితే కేవలం వీకెండ్ పర్యాటకుల కోసం ఈ రైలును అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది.
* రోజుకు రెండు సర్వీసులు..
విశాఖ నుంచి ప్రతి శని, ఆదివారాల్లో ఈ స్పెషల్ రైలు ఉదయం 8:30 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది.11:45గంటలకు అరకు చేరుకుంటుంది. మధ్యాహ్నం రెండు గంటలకు అరకులు తిరిగి బయలుదేరుతుంది.సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రైలులో ప్రత్యేక కోచ్ లు సైతం అందుబాటులో ఉంటాయి. ఒక సెకండ్ ఏసి, ఒక థర్డ్ ఏసి, 10 స్లీపర్ క్లాస్, నాలుగు సాధారణ రెండో తరగతి, రెండు సాధారణ కమ్ లగేజీ కోచ్లు ఉంటాయి.
* ఆ స్టేషన్ల మీదుగా
ఈ రైలు విశాఖలో బయలుదేరుతుంది. మధ్యలో సింహాచలం, కొత్తవలస, ఎస్ కోట, బొర్రా గుహల మీదుగా వెళుతుంది. అరకు ట్రిప్ ప్లాన్ చేసుకునే పర్యాటకులు ఈ రైలు సేవలను వినియోగించుకోవచ్చు. మరోవైపు రైల్వే శాఖ క్రిస్మస్, మహా కుంభమేళా సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ మేరకు 12 కొత్త రైళ్లను వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉంచారు. అవసరమైన వారు ఈ రైళ్లలో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.