Chandrababu plan for Amaravati: అమరావతి రాజధానిపై(Amravati capital) ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని చూస్తోంది. ఒకవైపు ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతుండగా.. తమకు కేటాయించిన స్థలాల్లో కార్యాలయాల నిర్మాణం పనిలో ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. ఇప్పటికే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం అయింది. మరోవైపు 12 బ్యాంకులకు సంబంధించి ప్రధాన కార్యాలయాల నిర్మాణం కూడా ప్రారంభం కానుంది. అయితే అమరావతి రాజధాని తొలి దశ పనులు 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం అమరావతిలో 79 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయి. వీటన్నింటిని ఏడాదిన్నరలో పూర్తిచేసేందుకు సి ఆర్ డి ఏ అన్ని ఏర్పాట్లు చేసింది. అన్నింటికంటే ముందు సిఆర్డిఏ భవనం పూర్తిచేసి ప్రారంభించనుంది. తద్వారా మిగతా పనులను సైతం వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సంకల్పంతో ఉంది.
79 పనులు ప్రారంభం..
సిఆర్డిఏ (crda) పరిధిలో 19 పనులకు 12,762 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మరోవైపు ఏపీ డీసీఎల్ నుంచి 36,737 కోట్ల రూపాయలతో 60 పనులు చేస్తున్నారు. దాదాపు 50 వేలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 54 వేల కోట్ల రూపాయల విలువైన 90 పనులకు పాలనాపరమైన అనుమతులు వచ్చాయి. వీటిలో 79 పనులు ప్రారంభం అయ్యాయి. మరో ఏడు పనులు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. మరో ఐదు పనులకు సంబంధించి టెండర్లు పిలవాల్సి ఉంది. మరో 36 వేల కోట్ల సంబంధించిన 20 పనులకు పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉంది.
ప్రజల్లో సంతృప్తి పెరిగేలా..
గత అనుభవాల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో 2027 నాటికి తొలిదశ పనులు పూర్తి చేయాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఒక కొలిక్కి తేవడం ద్వారా ప్రజల్లోకి మంచి సంకేతాలు పంపాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి తో పాటు సంక్షేమం అమలు జరుగుతోంది. భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థలు విశాఖకు క్యూ కడుతున్నాయి. ఇంకోవైపు రాయలసీమలో సైతం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఒకవైపు అమరావతి రాజధాని, ఇంకోవైపు రాష్ట్ర అభివృద్ధి సమాంతరంగా జరిగితే ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల మరింత సానుకూలత వ్యక్తం కానుంది. ప్రజల సంతృప్తి స్థాయి దాటితే రాజకీయంగా కూడా తిరుగుండదు అని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతిని ప్రపంచ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతూ వస్తున్నాయి.