Audimulapu Suresh: మరో తాజా మాజీ మంత్రి తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ సభ్యత్వం తో పాటు రాజ్యసభ సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. మరో మూడేళ్ల పదవీ కాలాన్ని సైతం వదులుకున్నారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని.. ఇక వ్యవసాయం చేసుకుంటానని చెప్పి మరి ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే చాలామంది నేతలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే మాజీ మంత్రి కొడాలి నాని పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అనారోగ్య కారణాలతో ఆయన సైతం రాజీనామా చేస్తారని ప్రచారం నడిచింది. కానీ అది ఫేక్ గా తేలిపోయింది. ఇప్పుడు మరో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
* రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో
ఆదిమూలపు సురేష్( Aadi moolapu Suresh ) జగన్కు అత్యంత విధేయనేత. పైగా విద్యాధికుడు కూడా. 2009లో ఇండియన్ రైల్వేలో సివిల్ సర్వెంట్ గా పదవీ విరమణ చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొలిసారిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి గెలిచారు సురేష్. 2019లో మాత్రం తిరిగి ఎర్రగొండపాలెం మారారు. ఆ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆదిమూలపు సురేష్. ఈసారి మాత్రం ఓటమి చవిచూశారు. ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉన్నారు. తరచూ తనను నియోజకవర్గాలు మార్చుతుండడం… స్థిరమైన నియోజకవర్గం లేకుండా చేయడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
* ఐదేళ్ల పాటు మంత్రిగా
2019 ఎన్నికల్లో వైసీపీ( YSR Congress ) గెలుపుతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. కీలకమైన శాఖలను అప్పగించారు. ముఖ్యంగా విద్యాశాఖను కట్టబెట్టారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఓ నలుగుర్ని కొనసాగించారు. అందులో ఆదిమూలపు సురేష్ ఒకరు కావడం విశేషం. అప్పట్లో ప్రకాశం జిల్లా నుంచి సురేష్ను మంత్రివర్గంలో కొనసాగించి.. తనను తొలగించడం పై బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పటినుంచి వైసిపి తో పాటు అధినేత జగన్ పట్ల వ్యతిరేక భావన పెట్టుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆదిమూలపు సురేష్ తీరు కారణంగానే బాలినేని బయటకు వెళ్లిపోయారు అన్న టాక్ ఉంది.
* సామాజిక వర్గ పెద్దల ద్వారా ప్రయత్నం
అయితే ఆదిమూలపు సురేష్ ( Aadi moolapu Suresh) ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తుండడం విశేషం. తెలుగుదేశం పార్టీలో ఉన్న తన సామాజిక వర్గ పెద్దల ద్వారా ఈ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో చంద్రబాబు పర్యటననే అడ్డుకున్నారన్న విమర్శ ఉంది. అయితే అప్పట్లో పార్టీ అధినేత జగన్ డైరెక్షన్లోనే అలా చేయాల్సి వచ్చింది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఆదిమూలపు సురేష్ కు మంచి వ్యక్తిగా పేరు ఉంది. కానీ నాడు చంద్రబాబుపై రాళ్లు వేయించారని ఇప్పటికి టిడిపి శ్రేణులు ఆగ్రహంగా ఉంటాయి. అందుకే ఆదిమూలపు సురేష్ చేరిక విషయంలో టిడిపి నుంచి అభ్యంతరాలు వస్తున్నట్లు సమాచారం. అయితే తాను ఎలాగైనా టిడిపిలో చేరుతానని ఆదిమూలపు సురేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.