TDP: రాజ్యసభ ఎన్నికల విషయంలో టిడిపి మనసు మార్చుకుందా? బలం లేని చోట బరిలో దిగడానికి భయపడుతోందా? సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇటువంటి సాహసం చేయకూడదని భావిస్తోందా? ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అనుకుంటుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని దించే ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. అదే జరిగితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాజ్యసభలో ఉన్న ప్రాతినిధ్యం కోల్పోయినట్టే.
ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వైసిపి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. వారితో నామినేషన్లు వేయించేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు టిడిపి అభ్యర్థిని నిలిపితే మాత్రం పోలింగ్ అనివార్యంగా మారుతుంది. అయితే నిన్న మొన్నటి వరకు టిడిపి అభ్యర్థిని నిలబెడుతుందని ప్రచారం జరిగింది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఒక రాజ్యసభ స్థానం గెలుచుకోవాలంటే కనీసం 44 మంది ఎమ్మెల్యేలు అవసరం. ప్రస్తుతం టిడిపికి 18 మంది మాత్రమే ఉన్నారు. మరో 26 మంది సభ్యుల మద్దతు అవసరం. వైసీపీలో సీట్లు నిరాకరించిన ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మారతారని టిడిపి అంచనా వేసింది. అందుకే అభ్యర్థిని పెట్టాలని భావించింది.
బిజెపితో పొత్తు కుదిరితే మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిని బరిలోదించాలని చంద్రబాబు భావించారు. కానీ పొత్తుల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. దీంతో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం సమీపిస్తోంది. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను తిప్పుకొని రాజ్యసభ స్థానాన్ని గెలుచుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని టిడిపి భయపడుతోంది. రాజ్యసభ కంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం టిడిపికి ప్రధాన అంశంగా మారింది. అందుకే వీలైనంతవరకూ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండేందుకు టిడిపి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే జరిగితే వైసిపి ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టే. ఇప్పటికే ఒకే ఒక రాజ్యసభ సభ్యుడు కనకమెడల రవీంద్ర కుమార్ ఉన్నారు. ఆయన ఏప్రిల్ 2 తో పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పుడు మూడు స్థానాల్లో ఒకటి ఆయన ఖాళీ చేసిందే. దీంతో రాజ్యసభలో టిడిపి ప్రాతినిధ్యం లేనట్టే.