Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు. భారీగా ట్విస్టులు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని అనుమానాలు. మొత్తానికైతే ఢిల్లీ రాజకీయాలు ఏపీని హీట్ పుట్టిస్తున్నాయి. నిన్నటికి నిన్న చంద్రబాబు బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపారు. దీంతో పొత్తులు ఖాయమని.. ఇక సీట్ల సర్దుబాటు మిగిలిందని ప్రచారం జరిగింది. ఇంతలో జగన్ ఢిల్లీలో వాలిపోయారు. ఈరోజు ప్రధానితో గంటన్నర పాటు చర్చలు జరిపారు. దీంతో కొత్త ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. పొత్తుపై అనేక రకాల అనుమానాలు కమ్ముకుంటున్నాయి. ఈ తరుణంలో పవన్ ఎలా ముందుకు సాగుతారు అన్నది చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి బిజెపితో పొత్తు టిడిపిలో మెజారిటీ వర్గానికి ఇష్టం లేదు. కానీ చంద్రబాబు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బిజెపితో పొత్తును కోరుకుంటున్నారు. అటు పవన్ కళ్యాణ్ సైతం 2014 తరహాలో పొత్తులు రిపీట్ అయితే.. ఏకపక్షంగా ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. బలమైన వైసీపీని ఓడించగలమని నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా గత ఏడాదిన్నరగా పవన్ చేయని ప్రయత్నాలు అంటూ లేవు. చివరిగా ఆ ప్రయత్నాలను ఒక కొలిక్కి తెచ్చారు. బిజెపి అగ్రనేతలతో చంద్రబాబు భేటీని జరిపించేలా చూశారు. అటు చంద్రబాబు అమిత్ షా తో కలిసిన తర్వాత.. ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ లాంచనమేనని అంతా భావించారు. ఇక సీట్ల సర్దుబాటు అంశంపై రకరకాల అంచనాలు వెలువడ్డాయి. ఇంతలోనే సీఎం జగన్ ను బిజెపి పెద్దలు ఆహ్వానించి చర్చలు జరపడంతో.. ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. బిజెపి ట్రాప్ లో చంద్రబాబు పడ్డారా? అన్న చర్చ ప్రారంభమైంది. బిజెపిపై అనుమానాలు కూడా మొదలయ్యాయి.
నిన్న ఢిల్లీ చేరుకున్న జగన్ కు అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. టిడిపి తో పొత్తు ప్రభావం వల్లే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని టాక్ నడిచింది. అయితే ఈరోజు నేరుగా ప్రధాని మోదీతో జగన్ సమావేశమయ్యారు. ఏకంగా గంటన్నర పాటు చర్చలు జరిపారు. దీని ద్వారా బిజెపి ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటుందోనని బలమైన చర్చ నడుస్తోంది. తమతో పొత్తుల చర్చలు చేస్తూ.. జగన్ తో ఆ మంత్రాంగం ఏమిటని టిడిపి శ్రేణులు ప్రశ్నించడం ప్రారంభించాయి. దీంతో మెజారిటీ టిడిపి నేతలు బిజెపి పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీరు సరికాదని ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తుల ద్వారా తమ సీట్లు త్యాగం చేయాల్సి వస్తుందని టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువమంది బీజేపీతో పొత్తు వద్దని కోరుతున్నారు. పొత్తు విషయం బిజెపి క్లారిటీ ఇచ్చేవరకు సీట్ల సర్దుబాటు జరగదు. అప్పటివరకు టిడిపి నేతల టెన్షన్ ఆగదు. ఇప్పటికే బీజేపీ సీట్ల విషయంలో చంద్రబాబు ముందు ఒక ప్రతిపాదన పెట్టింది. కానీ అందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. అలాగని సీట్లు తగ్గిస్తే బిజెపి ఒప్పుకోదు. ఒకవేళ బిజెపి ఒప్పుకోకుంటే పవన్ ఎవరి వైపు నిలుస్తారు అన్నది ప్రశ్న. మొత్తానికైతే బిజెపి అగ్ర నేతలు ఏపీ రాజకీయాల్లో పెద్ద కాక రేపుతున్నారు.