Film Celebrities Meet CM Chandrababu: తెలుగు సినీ ప్రముఖులు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబును( CM Chandrababu) కలవనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సినీ పరిశ్రమకు చెందిన 35 నుంచి 40 మంది ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది. ముందుగా వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు. అనంతరం పవన్ తో కలిసి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్ళనున్నారు. గత ఏడాది కాలంగా సినీ ప్రముఖులు సీఎం చంద్రబాబును కలవలేదు. పవన్ కళ్యాణ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలు పవన్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన సీఎం చంద్రబాబును కలిసి సమస్యలు విన్నవిద్దామని సూచించారు. అయితే సినీ ప్రముఖులు ఎవరు ఈ ఏడాది కాలంలో సీఎం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించలేదు. ఇటీవల థియేటర్ల బంద్ పిలుపు నేపథ్యం, అదే సమయంలో పవన్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ తేదీ ప్రకటన తరువాత బంద్ ప్రతిపాదన రావడంతో పవన్ సీరియస్ అయ్యారు. సినీ పరిశ్రమ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు సీఎం చంద్రబాబును సినీ ప్రముఖులు కలవక పోవడానికి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం చంద్రబాబును కలిసేందుకు సినీ ప్రముఖులు అపాయింట్మెంట్ తీసుకున్నారు.
* పరిశ్రమ విస్తరణకు చర్చలు..
అయితే ఏపీలో చిత్ర పరిశ్రమ( cine industry ) విస్తరణ జరగలేదు. తెలంగాణలోని హైదరాబాద్ కి చిత్ర పరిశ్రమ పరిమితం అయింది. కేవలం ఏపీ అనేది సినీ మార్కెట్ కు పరిమితం చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇంకోవైపు ఏపీకి చెందిన సినీ పరిశ్రమ కార్మికులకు స్థానికంగానే ఉపాధి దక్కాలంటే.. ఏపీలోని విశాఖ, విజయవాడ, తిరుపతి తో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో షూటింగులు జరగాల్సిన అవసరం ఉంది. సినీ పరిశ్రమకు సంబంధించి 24 ఫ్రేమ్స్, విభాగాలు ఏపీలో అభివృద్ధి చేయాలి. అది జరగాలంటే సినీ ప్రముఖుల సాయం అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో సినీ ప్రముఖులు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను కలవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తప్పకుండా ఏపీలో సినీ పరిశ్రమ విస్తరణకు సంబంధించి నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.
* అనుకూల నిర్ణయాలు..
అయితే కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా పెద్ద, చిన్న సినిమాల విడుదలకు సంబంధించి టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తూనే ఉంది. అంతకు ముందు ప్రభుత్వం చిత్ర హీరోలు, నిర్మాతలను అనుసరించి నిర్ణయాలు తీసుకునే వారని విమర్శ ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరి సినిమాలకు చాలా రకాల మినహాయింపులు ఇస్తూ వస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం ఎగ్జిబిటర్లు, సినిమా ధియేటర్లకు సంబంధించి కమీషన్లు వంటి వివాదాలు నడుస్తున్నాయి. దీనికి ప్రభుత్వం చక్కటి పరిష్కార మార్గం చూపుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా టిక్కెట్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటూనే.. సినిమాలకు సంబంధించి నిలబడేందుకు కొన్ని రకాల అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నిటికీ మించి థియేటర్లలో ధరల బాదుడుపై చర్చించాలని సామాన్య జనాలు కోరుతున్నారు. మరి వీరి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
* పవన్ కళ్యాణ్ కు వివరణ..
మరోవైపు హరిహర వీరమల్లు( Harihara Veera Mallu ) సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ ప్రతిపాదన వచ్చింది. దీనిపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. చిత్ర పరిశ్రమ కోసం కృషి చేస్తుంటే తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ బంద్ ప్రతిపాదన వెనుక రాజకీయ కుట్ర ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆ నలుగురు అంటూ కథనాలు వచ్చాయి. అయితే దీనిపై సినీ ప్రముఖులు క్లారిటీ ఇచ్చారు. కుట్ర ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సినీ ప్రముఖులంతా నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై పవన్ కళ్యాణ్ కు వారు వివరణ ఇచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో.