Visakhapatnam news : విశాఖ( Visakhapatnam) వాసులకు గుడ్ న్యూస్. ఇక కూరగాయల గురించి మార్కెట్కు వెళ్లాల్సిన పనిలేదు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న మరుక్షణం కూరగాయలు ఇట్టే ఇంటికి చేరిపోతాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అరుదైన అవకాశాన్ని కల్పించింది విశాఖ ప్రజలకు. ఏపీ మార్కెటింగ్ శాఖ ఈ వినూత్న ఆలోచన చేసింది. ప్రజలకు తక్కువ ధరకే తాజా కూరగాయలు, పండ్లను హోమ్ డెలివరీ చేస్తోంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న కొద్దిసేపటికి ఇవి ఇంటికి చేరుతాయి. ముందుగా విశాఖలో పైలెట్ ప్రాజెక్టు కింద హోమ్ డెలివరీ విధానాన్ని అమలు చేశారు. ఓ చోట సక్సెస్ కావడంతో నగరంలోని మిగతా రైతు బజార్లలో కూడా అమలు చేస్తున్నారు. అక్కడ కూడా విజయవంతం అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు మార్కెటింగ్ శాఖ అధికారులు.
* ప్రయోగాత్మకంగా..
ఇప్పుడంతా ఆన్లైన్( online) పద్ధతిలోనే జరుగుతోంది. కట్టుకునే బట్టల నుంచి తినే ఆహారం వరకు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలు నిమిషాల వ్యవధిలో ఇంటికి వచ్చి చేరుతున్నాయి. మార్కెట్లో రకరకాల యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇక్కడే ఏపీ మార్కెటింగ్ శాఖ వినూత్నంగా ఆలోచన చేసింది. రైతు బజార్లనుంచి కూరగాయలను, పండ్లను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. విశాఖ నగరంలోని ఎంవిపి కాలనీ రైతు బజార్లో ఈ విధానాన్ని ప్రారంభించింది. ట్రయల్ రన్ లో భాగంగా నెల రోజులపాటు ఉచితంగానే ప్రజలకు డోర్ డెలివరీ చేశారు. ప్రతిరోజు వందలాదిమంది ఈ సేవలను పొందారు. ఈ డోర్ డెలివరీ విధానం అక్కడ సక్సెస్ కావడంతో నగరంలోని మిగతా రైతు బజార్లలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
* అన్ని రైతు బజార్లలో..
విశాఖ నగరంలో ఎంవిపి కాలనీ( MVP Colony), మర్రిపాలెం, గాజువాక, గోపాలపట్నం, మధురవాడ, నరసింహనగర్లలో రైతు బజార్లు ఉన్నాయి. ఎంవిపి కాలనీలో డోర్ డెలివరీ విధానం సక్సెస్ కావడంతో.. మిగతా చోట్ల అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే రైతు బజార్ల నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఈ సేవలు అందిస్తారు. ఈ డోర్ డెలివరీ చేసేందుకు గాను రవాణా ఖర్చుల కింద 39 రూపాయలు వసూలు చేస్తారు. ఆన్లైన్లో కూరగాయలను బుక్ చేయాలనుకునేవారు https://digirythubazaarap.com యాప్ నకు సంప్రదించవచ్చు. ప్రభుత్వం రూపొందించిన ఈ వెబ్సైట్లో క్యూఆర్ కోడ్ ఉంది. దానిని స్కాన్ చేస్తే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. ప్రస్తుతానికి ఈ సదుపాయం విశాఖ నగరంలోని రైతు బజార్లలో మాత్రమే ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే డోర్ డెలివరీ విధానాన్ని అమలు చేసేందుకు గాను ఏపీ మార్కెటింగ్ శాఖ మేషంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సమస్తతో ఒప్పందం చేసుకుంది. అయితే ప్రస్తుతం డోర్ డెలివరీ ద్వారా తాజా కూరగాయలతో పాటు ధరలు కూడా అందుబాటులో ఉన్నాయని విశాఖ నగర వాసులు చెబుతున్నారు.